నామ్‌ కే వాస్తేగా పనిచేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఇప్పటికే పక్షం రోజులు జాప్యం జరిగిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని రైతుల నుండి వరి ధాన్యం సేకరించేందుకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం సాయంత్రం ఆయన సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మన ఊరు – మన బడి, ఉపాధి హామీ పథకం పనుల ప్రగతిపై సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సోమవారం నుండి అన్ని కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగాలని ఆదేశించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే లారీలలో లోడ్‌ చేయించి కేటాయించిన రైస్‌ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఏమాత్రం అలసత్వానికి తావు కల్పించినా, రైతులు ఒక్కసారిగా కేంద్రాలకు ధాన్యాన్ని తెస్తారని, దీనివల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ముందు నుండే ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్ల ను వేగవంతంగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ హితవు పలికారు. ఆదివారం సాయంత్రం లోగా కనీసం 2 లారీల లోడ్ల ధాన్యాన్ని రైస్‌ మిల్లుకు తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో తహసిల్దార్‌లు క్రియాశీలక పాత్ర పోషించాలని, ఏదో నామ్‌కే వాస్తేగా పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ధాన్యం తీసుకు వచ్చిన పక్షంలో తక్షణమే తూకం జరిపించాలని, కేంద్రాల ప్రారంభోత్సవం కోసం వేచి చూడకూడదని కలెక్టర్‌ తేల్చి చెప్పారు. తడిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని సూచించారు. ఈ విషయంలో రైతులుకు అవగాహన కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యం వర్షానికి తడిసిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, టార్పాలిన్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

ఇదిలాఉండగా, మన ఊరు – మన బడి పనుల ప్రగతిని కలెక్టర్‌ సమీక్షిస్తూ, నిర్దేశిత వ్యయం కంటే పది శాతానికి మించి అంచనా వ్యయం కలిగిన ప్రతిపాదిత పనులను మరోమారు క్షేత్రస్థాయిలో పరిశీలించి సాధ్యమైనంత వరకు అంచనా వ్యయాన్ని తగ్గిస్తూ మరోమారు ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే అనుమతులు లభించిన పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. నోడల్‌ అధికారులు ఈ పనుల పట్ల పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్‌ సూచించారు.

కాగా ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల ప్రాతినిధ్యం 40 శాతానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మండల అధికారులకు స్పష్టమైన లక్ష్యం నిర్దేశించారు. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా గుర్తించిన పనులను వెంటనే ప్రారంభం అయ్యేలా చూడాలని, క్షేత్ర స్థాయిలో తాను పర్యటించి ఈ పనులను స్వయంగా పరిశీలిస్తానని పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరందించే ప్రక్రియను నిశితంగా పరిశీలన జరపాలని, ఏ ఒక్క మొక్క ఎండిపోయినా సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

వచ్చే నెల 20వ తేదీ నుండి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలోనూ హరితహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్న దృష్ట్యా అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రా మిశ్రా, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గోవింద్‌, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »