డిచ్‌పల్లి, ఏప్రిల్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ క్యాంప్ ఆదివారం విజయవంతంగా ముగిసింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌ఎస్‌ఎస్ కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. గత వారం రోజులుగా వివిధ జనహిత కార్యక్రమాలు నిర్వహించి గ్రామ ప్రజలను చైతన్యం చేసినందుకు వాలంటీర్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. అక్షరాస్యతా సాధన, విద్యా వైద్య సదుపాయాలను అందిపుచ్చుకోవడం, ఉపాధి కల్పన, ప్రభుత్వ విధానాలు, ప్రజల ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పులు, వ్యవసాయ సాగులో వివిధ వంగడాల ప్రాధాన్యం, స్వయం పోషక ఆహార పదార్థాల స్వీకరణ విషయాల్లో వాలంటీర్లు పల్లె జనులకు అవగాహన కలిగించారని ప్రశంసించారు.
గ్రామ పంచాయితి, సెక్రటరీ, పాఠశాల, అంగన్‌వాడి, వెలుగు, ఆశా వర్కర్స్ వంటి సంస్థల సిబ్బందితో సన్నిహిత సంబంధం గ్రామ స్వరాజ్య కాంక్షను పెంపొందింపజేసుకోవడంలో వాలంటీర్ల చొరువ అధికమైదని అన్నారు. అనేక నినాదాలు ప్లకార్డులతో ప్రదర్శించి జాగృతి కలిగించారని అన్నారు.
మానసిక వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే ఇటువంటి శిక్షణా శిబీరాన్ని ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న దాదాపు వందకు పైగా ప్రోగ్రాం ఆఫీసర్స్ మూడు నెలల వ్యవధిలో స్పెషల్ క్యాంప్‌లు నిర్వహిస్తుండడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో చివరగా వాలంటీర్లు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి పాటలు, కవిత్వం, కథలు, నాటికలు ప్రదర్శించారు. వారి వారి అనుభూతులు, అనుభవాలు తెలిపారు.