ప్రజావాణికి గైర్హాజరైతే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపిస్తే అంగీకరించబోమని, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని కరాఖండీగా తేల్చి చెప్పారు. వచ్చే సోమవారం నుండి జిల్లా అధికారులు ఎవరైనా గైర్హాజర్‌ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోమవారం స్థానిక ప్రగతి భవన్‌లో అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రాలతో కలిసి కలెక్టర్‌ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 82 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. అయితే ప్రజావాణికి కొన్ని కీలక శాఖల జిల్లా అధికారులు సైతం గైర్హాజర్‌ అయ్యారు.

మరికొంత మంది తమ కింది స్థాయి అధికారులను పంపించారు. దీనిని గమనించిన కలెక్టర్‌ నారాయణరెడ్డి, ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం ఒక్కో శాఖ వారీగా అధికారుల హాజరును పరిశీలించారు. ఎలాంటి సమాచారం అందించకుండానే పలు శాఖల అధికారులు ప్రజావాణికి డుమ్మా కొట్టడం పట్ల కలెక్టర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సదరు అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.

మరికొన్ని శాఖల జిల్లా అధికారులకు బదులు కింది స్థాయి అధికారులు హాజరయ్యారు. దీంతో ప్రతి శాఖకు చెందిన జిల్లా అధికారియే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ప్రజావాణిలో ఉండాలని తేల్చి చెప్పారు. ఎవరికైనా అత్యవసరమైన పని ఉంటె ముందుగానే తమ దృష్టికి తేవాలని సూచించారు. తమ అనుమతి లేకుండా ప్రజావాణికి గైర్హాజర్‌ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

తమ సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయనే గట్టి నమ్మకంతో ప్రజలు తరలివచ్చి ప్రజావాణిలో వినతులు, ఫిర్యాదులు అందిస్తారని, అలాంటప్పుడు జిల్లా అధికారులు అందుబాటులో లేకపోతే ఈ కార్యక్రమం ప్రాధాన్యత సన్నగిల్లే ప్రమాదం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు తప్పనిసరిగా ప్రజావాణిలో పాల్గొనాలని, ప్రజలు సమర్పించే అర్జీలను పరిష్కరించేందుకు అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. దీనివల్ల జిల్లా యంత్రాంగంపై, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో మరింత నమ్మకం బలపడుతుందని పేర్కొన్నారు.

అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతోందనే విషయాలను తెలుసుకునేందుకు, శాఖా పరమైన అంశాలను తన దృష్టికి తెచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని వేదికగా ఉపయోగించుకోవచ్చని సూచించారు. ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తూ, నిబద్దతతో పని చేయాలని కలెక్టర్‌ జిల్లా అధికారులకు సూచించారు.

ఫిర్యాదుదారులు అనవసర ఇబ్బందులకు గురి చేయకుండా సమస్యల సత్వర పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో డీపీవో జయసుధ, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్‌ ఏ.ఓ సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »