నిజామాబాద్, ఏప్రిల్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా సంక్షోభం కారణంగా గడిచిన రెండు సంవత్సరాల నుండి పూర్తిగా కోవిడ్ నివారణ కార్యక్రమాలు, వ్యాక్సినేషన్ పైనే దృష్టిని కేంద్రీకరించాల్సి వచ్చిందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత దాదాపుగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన హెల్త్ ప్రొఫైల్‌ను అప్డేట్ చేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతి భవన్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి పీహెచ్‌సి పరిధిలో ఆశ వర్కర్లచే ఇంటింటి సర్వే నిర్వహింప చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్, హెచ్‌ఐవి, కుష్టు, క్షయ, డయాబెటిస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, డయాలసిస్, తలసీమియా తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించడంతో పాటు బాలింతలు, గర్భిణీలు, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసుకున్నవారు, దివ్యాంగులు తదితరుల వివరాలను సైతం నిర్ణీత ప్రొఫార్మా ప్రకారంగా సేకరించి ఏఎన్‌ఎంల ద్వారా డాటా ఎంట్రీ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఏదో మొక్కుబడిగా చేపట్టకుండా పక్కాగా సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారం పది రోజుల వ్యవధి లోపు సర్వేను పూర్తి చేయాలని గడువు విధించారు.
జిల్లాలో జాతీయ రహదారులకు ఇరువైపుల హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రగతి భవన్‌లో మంగళవారం అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం జరిపారు. వివాదాలు నెలకొని ఉన్న భూములకు సంబంధించి భూ రికార్డుల ఆధారంగా సర్వే జరిపించి వివాదాల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులకు సూచించారు.
ముఖ్యంగా అవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన హరిత హారం మొక్కలను ప్రస్తుత వేసవి బారి నుండి పూర్తి స్థాయిలో కాపాడేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. తాను వారం రోజుల అనంతరం హైవే మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని, ఎక్కడైనా ఏ ఒక్క మొక్క ఎండిపోయి కనిపించినా, ట్రీ గార్డ్ సరిగా లేకపోయినా ఉపేక్షించబోమని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తదితరులు పాల్గొన్నారు.