విద్యను ఆయుధంగా మల్చుకుంటేనే ఉత్తమ భవితవ్యం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నతమైన భవిష్యత్తు కోసం విద్యను ఆయుధంగా మలచుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని న్యాల్‌ కల్‌ రోడ్డులో గల ఆనంద నిలయం హాస్టల్‌లో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

వార్షిక పరీక్షల సన్నద్ధతపై కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమైనదని అన్నారు. అందులోనూ ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడేందుకు పదవ తరగతి ముఖ్య ఘట్టంగా నిలుస్తుందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు వార్షిక పరీక్షల కోసం చక్కగా చదువుతూ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని సూచించారు. చదువును కష్టం అని భావించకుండా, ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ ఇష్టపడి చదివితే అత్యున్నత ఫలితాలు సాధించవచ్చని అన్నారు.

బట్టీ పడితే ఎక్కువ గ్రేడ్‌ పాయింట్లు వస్తాయి తప్ప, ఇలాంటి చదువు జీవితానికి అంతగా ఉపయోగపడదని పేర్కొన్నారు. ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాం అనే ఉత్సాహవంతమైన ఆలోచనతో పుస్తకాలలోని పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకుంటే విషయ పరిజ్ఞానం ఏర్పడి, అది జీవిత కాలం గుర్తుండిపోతుందని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. మన తలరాతను మార్చుకునేందుకు విద్యను అనుకూలంగా మలచుకుంటే అద్భుతాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

తాము ఉన్నత స్థానానికి ఎదిగి, ఒక్క సంతకంతో వంద కుటుంబాల జీవన స్థితిగతులను మార్చగలిగే స్థాయికి చేరుకోవాలనే అంకిత భావం, పట్టుదలతో చదవాలని సూచించారు. పరీక్షలు సమీపించిన దృష్ట్యా సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని, ఒక్క నిమిషం వృధా చేసినా జీవితంలో మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని పొందలేరని అన్నారు.

సెల్‌ ఫోన్‌, సినిమాల మోజులో పది చదువును నిర్లక్ష్యం చేస్తే అక్కడే ఆగిపోతామని, ఉన్నత భవితవ్యం లక్ష్యం నీరుగారిపోకుండా ఉండేందుకు గాను చదువుకు అడ్డుగా ఉన్న ప్రతి అలవాటును దూరం చేసుకోవాలని హితవు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆలోచనలు చదువు మీదే కేంద్రికృతమై ఉండాలని, పక్కదారి పట్టకూడదని సూచించారు.

ఇదిలాఉండగా, పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు, గ్రూప్‌ ఎగ్జామ్స్‌ కోసం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల అభ్యర్థులకు స్టడీ సర్కిల్స్‌ ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాలను కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని నాందేవ్‌ వాడలో గల ఎస్సీ బాలుర వసతి గృహం పై అంతస్తులో నిర్వహిస్తున్న కోచింగ్‌ సెంటర్‌తో పాటు, గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని రూసా బిల్డింగ్‌ను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.

పెద్ద మొత్తంలో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ లు వెలువరిస్తున్న దృష్ట్యా పోటీ పరీక్షలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అభ్యర్థులకు సూచించారు. ఒక్క మార్కు తేడాతో ఎంతో గొప్ప అవకాశం చేజారిపోతుందని, దీనిని గుర్తెరిగి విషయ పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదవాలని, జిల్లాకు అత్యధిక కొలువులు సాధించి పెట్టాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు.

కాగా, కోచింగ్‌ సెంటర్లలో అనుభవజ్ఞులైన అధ్యాపకుచే శిక్షణ ఇప్పించాలని, అభ్యర్థులకు అవసరమైన అన్ని వసతి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, శిక్షణ కేంద్రాల వద్ద అవసరమైన సిబ్బందిని నియమించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో దుబ్బ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ వెంట జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి శశికళ, జిల్లా షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధి అధికారి నాగోరావ్‌, మెప్మా పీడీ రాములు, గిరిరాజ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణ, భూమయ్య, ఆర్‌.రాములు తదితరులు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »