కామారెడ్డి, ఏప్రిల్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిమాపక శాఖ అధికారులు వరదలు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు సేవ చేయడానికి ముందుంటారని చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుతారని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101 నెంబర్‌కి సమాచారం అందించాలని సూచించారు. 7 రోజుల పాటు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రమాదాలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్త చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారని పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై వివిధ పాఠశాలల్లో వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు జిల్లా కలెక్టర్ బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సయ్యద్ మహమ్మద్ అలీ, లీడిరగ్ ఫైర్ మెన్ రవీందర్ రెడ్డి, డ్రైవర్ ఆపరేటర్ సిహెచ్. బాలరాజు, ఫైర్ మెన్ లక్ష్మణ్, స్టాలిన్, సంతోష్ కుమార్, వి. వెంకటి, ఎల్. సిద్ధిరాములు పాల్గొన్నారు.