నిజామాబాద్, ఏప్రిల్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని జిల్లాలో జయప్రదం చేయాలని నగర కార్యదర్శి ఎం. సుధాకర్ అన్నారు. బుధవారం శ్రామిక భవన్, కోటగల్లిలో పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, మెజార్టీ హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదన్నారు. కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని దుర్మార్గమైన వైఖరిని ప్రభుత్వం ప్రదర్శిస్తున్నదన్నారు. సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీగా, ప్రజా సంఘాలుగా పై డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు, తహాసిల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేసి కలెక్టర్‌లకు, తహసీల్దార్లకు, ఆర్.డి.వోలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు.
ఇంకా ఈ కార్యాచరణ కొనసాగుతున్నదన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార దిశగా స్పందించడం లేదన్నారు. అందువల్ల ఈనెల 25న ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమానికి సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పిలుపునిచ్చిందన్నారు. ఈనెల 25వ తేదీన జిల్లాలోను ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. అందులో భాగంగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ క్యాంపు కార్యాలయం ముట్టడి నిర్వహిస్తామన్నారు. రూరల్ నియోజకవర్గ ప్రజలు, అర్హులైన లబ్ధిదారులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు, ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, రేషన్ కార్డులు, పోడు భూములకు పట్టాలు ఇవ్వడం తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన మూడున్నర లక్షల ఆసరా పెన్షన్ లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వి.గోదావరి, కె.సంధ్యారాణి, సిహెచ్ సాయగౌడ్, నర్సక్క మహిపాల్ పాల్గొన్నారు.