అగ్నిమాపక శాఖ సేవలు అభినందనీయం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రమాద ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలలో అగ్నిమాపక శాఖ అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసాపూర్వకంగా ఉంటున్నాయని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అభినందించారు. ముందు ముందు కూడా ఇదే తరహా స్ఫూర్తిని కనబరుస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు బుధవారం ముగిసాయి. జిల్లా కేంద్రంలోని ఫైర్‌ స్టేషన్‌ లో ఏర్పాటు చేసిన ముగింపు వారోత్సవాలకు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా ఇతర అనేక రకాల విపత్తులు సంభవించిన సమయంలోనూ సహాయక చర్యలు చేపట్టడంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గతేడాది కాలంలో 22 మంది ప్రాణాలను రక్షించడంతో పాటు 12 కోట్ల 54 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి నష్టాన్ని నివారించడం గొప్ప విషయం అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ ఆ శాఖ పేరును కూడా అగ్నిమాపక విపత్తుల నివారణ శాఖగా మార్చిందని కలెక్టర్‌ గుర్తుచేశారు.

పట్టణీకరణ పెరుగుతున్న క్రమంలో రానున్న రోజుల్లో అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తు ఘటనలు మరింత ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున ఎంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత నివారణ చర్యలు చేపట్టడం కంటే, ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ఎంతో ఉత్తమమని సూచించారు.

ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే హోటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, హాస్పిటల్స్‌, స్కూల్స్‌, కాలేజీలు వంటి చోట్ల తప్పనిసరిగా అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచుతూ, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కాగా జిల్లాలో అగ్నిమాపక శాఖ సేవలు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్‌ పేర్కొన్నారు.

జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జి. మురళీమనోహర్‌ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో గతేడాది 379 అగ్నిప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ ప్రమాదాల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారని, 2.88 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వివరించారు. అయితే, తమ అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో స్పందిస్తూ 22 మంది ప్రాణాలు రక్షించారని, 12.54 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని బుగ్గిపాలు కాకుండా కాపాడగలిగారని తెలిపారు.

ప్రధానంగా మన నిర్లక్ష్యం వల్లనే 90శాతం అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌, ఎల్‌పిజి గ్యాస్‌ లీకేజీ వంటి వాటి వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అగ్నిప్రమాద సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రిటైర్డ్‌ సిబ్బందిని ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో సహాయ డిఎఫ్‌ఓ భానుప్రతాప్‌, ఎస్‌ఎఫ్‌ఓలు నర్సింగరావు, మధుసూదన్‌ రెడ్డి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పిఆర్‌ సోమాని, వైద్యులు రామ్‌ చందర్‌, సుభాష్‌, జలగం తిరుపతి రావు, మోహన్‌, అగ్నిమాపక సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ పనితీరు గురించి, అగ్నిమాపక పరికరాలను వినియోగించే విధానాల గురించి సిబ్బంది కలెక్టర్‌కు ప్రయోగాత్మకంగా వివరించారు. పదవీ విరమణ చేసిన పలువురు అధికారులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »