కామారెడ్డి, ఏప్రిల్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకి వస్తున్న అనూహ్య స్పందన చూసి ఓర్వలేక దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, రామాయంపేట తల్లి కొడుకుల ఆత్మ హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాం చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని సాక్షాత్తు గవర్నర్‌ని సోషల్ మీడియాలో, బయట ఇబ్బందులు పెడుతున్న అధికార పార్టీ నాయకులు సాధారణ మహిళల పరిస్థితి ఏంటో ప్రజలకు అర్థం అవుతుందని, ప్రొద్దున పేపర్ చూస్తే రాష్ట్రంలో ఏదో ఒక చోట అధికార పార్టి నాయకుల చేతిలో బలి అయిన మహిళల గురించి వార్త లేకుండా ఏ రోజు గడవటం లేదని వారికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ది చెప్తారని అన్నారు.
బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ తెలగాణలో తెలంగాణ రాక్షసుల సమితి తెరాస పాలనలో సాధారణ వార్డు మెంబర్ నుండి మంత్రుల వరకు అందరూ ప్రజలను రాబందుల్లా పీక్కు తింటున్నారని, నిన్న ఒక్క రోజే కూకట్‌పల్లిలో, సూర్యాపేటలో, బొడుప్పల్‌లో మహిళలపై అధికార పార్టీ నాయకుల వేధింపులు, అత్యాచారాలు వెలుగులోకి వచ్చాయని ఇలా కబ్జాలు, సెటిల్ మెంట్‌లు తప్ప ప్రజల బాగోగులు మరిచిన అధికార పార్టీ నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ఒక్క వార్త కూడా లేదని, ముఖ్యమంత్రి కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తుందని అన్నారు. పోలీసులు కూడా అధికార పార్టి నాయకులకు వత్తాసు పలకడం కరెక్ట్ కాదని అన్నారు.