నిజామాబాద్, ఏప్రిల్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశానుసారం ఆడిట్ సెల్ డైరెక్టర్ డా. బి. విద్యావర్ధిని, జాయింట్ డైరెక్టర్ డా. బాలకిషన్ గురువారం ఉదయం ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఆర్ కళాశాలలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల వీసీ ఆకస్మిక తనిఖీ నిర్వహించవలసిందిగా ఆదేశించారని అన్నారు. తనిఖీలో పలు లోపాలు బయటపడ్డాయని ఆమె అన్నారు. నిజామాబాద్ నగరంలో కవితా కాంప్లెక్స్ మీద పది పీజీ కోర్సులు గల పీజీ కళాశాలకు అనుమతి తీసుకొని నిర్వహిస్తున్నట్లుగా చూపించారని, కాని అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా అదంతా డమ్మి అని తేలిపోయినట్లుగా ఆమె తెలిపారు.
అక్కడ గదులన్ని మూసి ఉన్నాయని, కేవలం తన నివాస ఇంటి మీదనే నడుపుతున్న డిగ్రీ కళాశాలలోనే పీజీ కళాశాలను కూడా నడుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని అన్నారు. చాలినన్ని తరగతి గదులు లేకపోవడం, ప్రాథమిక అవసరాలైన మంచి నీటి వసతి, మరుగుదొడ్ల సదుపాయాలు లేకపోవడం, కంప్యూటర్, సైన్స్ లాబ్స్ లేకపోవడం, మైదాన ప్రదేశం లేకపోవడం, వాహన పార్కింగ్ లేకపోవడం, ఆయా కోర్సులకు సరిపోయే అధ్యాపకులు లేకపోవడం, ఉన్న కొద్ది మంది అధ్యాపకులకు సరిగ్గా జీతాలు చెల్లించకపోవడం వంటివి తమ తనిఖీలో బయట పడ్డాయని అన్నారు.
కళాశాల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లోపాలతో సమగ్ర నివేదికను వీసీకి అందించినట్లుగా ఆమె వివరించారు. అందుకు వీసీ తక్షణమే ఎస్‌ఎస్‌ఆర్ కళాశాల మీద తగు చర్యలను తీసుకోవలసిందిగా తనను ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.