నిజామాబాద్, ఏప్రిల్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కలెక్టరేట్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ముస్లింలు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు, కలెక్టరేట్ ఉద్యోగులతో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని అన్నారు. వారి ప్రార్థనలు ఫలించి నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉండాలని, అన్ని శాఖలు ప్రత్యేకించి రెవెన్యూ శాఖ సమస్యల నుండి బయట పడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నిజామాబాద్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తుందని, ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తారని అభినందించారు.
ముందు ముందు ఇదే తరహా స్ఫూర్తిని కనబరచాలని సూచించారు. కాగా రంజాన్ మాసం పవిత్రత, ప్రాశస్త్యం గురించి రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి అందరినీ ఆకట్టుకునే రీతిలో వివరించారు. ఇఫ్తార్ విందులో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, బోధన్ ఆర్డిఓ రాజేశ్వర్, రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్, జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షులు వేణు గోపాల్, కోశాధికారి విజయ్ కాంతారావు, ఉపాధ్యక్షులు భూపతి ప్రభు, తహసీల్దార్లు రమేష్, అనిల్, శేకర్ , ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.