ఇక నుండి వారిని భూదేవిగా పిలుద్దాం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రాన్స్‌ జెండర్లను ప్రభుత్వ పరంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని విధాలుగా ఆదుకుంటామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి భరోసా కల్పించారు. సమాజంలోని ఇతరులు అందరిలాగే ట్రాన్స్‌ జెండర్లకు కూడా గౌరవం దక్కాలని అభిలషించారు. ఈ దిశగా వారిని స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహిస్తామని, వృత్తి నైపుణ్య శిక్షణ కోసం పది లక్షల రూపాయలను మంజూరు చేస్తానని కలెక్టర్‌ ప్రకటించారు.

జిల్లా జనరల్‌ ఆసుపత్రి ఆవరణలో కొనసాగుతున్న సఖీ కేంద్రంలో ట్రాన్స్‌ జెండర్ల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ నెలకొల్పారు. అదనపు కలెక్టర్‌ చిత్రా మిశ్రాతో కలిసి కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి గురువారం దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, భూమాతకు ఉన్నంత ఓపిక ట్రాన్స్‌ జెండర్లకు ఉంటుందని, అందుకే ఇకనుండి వారిని భూదేవిగా పిలుద్దామని కలెక్టర్‌ నూతన నామకరణం చేశారు.

హెల్ప్‌ డెస్క్‌ను భూదేవి హెల్ప్‌ డెస్క్‌గా ఆదరించాలని అన్నారు. అందరిలాగే ట్రాన్స్‌ జెండర్లకు కూడా సమాజంలో సమాన ఆదరణ, అభివృద్ధి అవకాశాలు లభించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ట్రాన్స్‌ జెండర్లకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని, అర్హత సాధించిన వారిని ప్రభుత్వ శాఖల్లో అవుట్‌ సోర్సింగ్‌ కింద ఉద్యోగాల్లో నియమిస్తామని అన్నారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా వ్యాపార సంస్థను నెలకొల్పాలని కోరుకుంటే, అలాంటి వారికి మెప్మా ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న తరహాలోనే పావులా వడ్డీ రుణాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా ట్రాన్స్‌ జెండర్లు అందరికి గుర్తింపు కార్డులు, రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు సాధ్యమైనంత త్వరగా అందించేందుకు చొరవ చూపుతానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. సమాజం తమను హేళన చేస్తుందనే ఆత్మన్యూనతా భావం నుండి ట్రాన్స్‌ జెండర్లు బయటకు వచ్చి, తమ కాళ్లపై తాము నిలబడేలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, మీ వెంట యావత్‌ జిల్లా యంత్రాంగం ఉంటుందని సూచించారు.

ట్రాన్స్‌ జెండర్లకు ప్రభుత్వ పరంగా తోడ్పాటును అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి రaాన్సీ, జిల్లా జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌, డాక్టర్‌ జలగం తిరుపతిరావు, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, మల్యాల గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »