కామారెడ్డి, ఏప్రిల్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తాడని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆయుష్మాన్ భారత్, ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ మేళాలను ఎల్లారెడ్డి ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ వైద్య అధికారులకు సూచించారు. ఆరోగ్య మేళాలో వైద్యులు అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించారని చెప్పారు. అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
మధుమేహం, రక్తపోటు, క్షయ, చెవి, ముక్కు, గొంతు పరీక్షలు, దంత, మలేరియా, అంధత్వ నివారణ పరీక్షలు,చర్మ వ్యాధి వైద్యనిపుణులతో పాటు క్యాన్సర్, కుష్టు, క్షయపై అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆయుర్వేదంతోపాటు యోగా, మెడిటేషన్‌పై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. మాతా శిశు సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, పొగాకు వినియోగం దుష్ఫలితాలు, అంధత్వ నివారణ పై అవగాహన కల్పిస్తారని అన్నారు. అవసరమైనవారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ అందించే అన్ని సర్వీస్‌లు మేళాలో అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ అన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే మేళాను ఎల్లారెడ్డి డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏంపీ బిబి పాటిల్ మాట్లాడారు. పరిసరాల శుభ్రత పాటిస్తే ఎలాంటి వ్యాధులు రావని సూచించారు. రోగాలు వచ్చినవారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు పొందాలని పేర్కొన్నారు.
వైద్య శిబిరాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడారు. ఆరోగ్య తెలంగాణ ఏర్పాటు చేయడమే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు లక్ష్యమని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని సూచించారు. మెగా వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యపరమైన సేవలను పొందాలన్నారు. పుట్టిన బిడ్డలకు తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలని కోరారు. ముర్రుపాలు అమృతంతో సమానంగా భావించాలని పేర్కొన్నారు.
మెగా హెల్త్ క్యాంపులో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ ప్రజా ప్రతినిధులు, వైద్యులు రవీంద్ర మోహన్ విజయలక్ష్మి, శోభరాణి, వెంకటస్వామి, క్రాంతి కుమార్, శరత్, ఆయుష్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారులు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఎయిడ్స్, టీబీ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాటలు పాడుతూ అవగాహన కల్పించారు.