కామారెడ్డి, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, సేక్టోరియల్ అధికారి గంగా కిషన్ సందర్శించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి విద్యార్థుల నైపుణ్యాలను పరీక్ష చేసి విద్యార్థులను అభినందించారు. పాఠశాల అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా డి.ఈ.ఓ రాజు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్కూల్‌కు దీటుగా అభివృద్ధి చేయడం, మౌలిక వసతులు కల్పించడం, పాఠశాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని చెట్లతో అలంకరించడం, పిల్లల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని పాఠశాలలోని కిచెన్ గార్డెన్ కూరగాయ చెట్లు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని, పాఠశాలకు మూడు మండలాల విద్యార్థులు చదువుకోవడానికి రావడం చాలా అభినందనీయమని అన్నారు.
పాఠశాలను విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు దత్తత తీసుకొని తన సొంత ఖర్చుతో దాదాపు 11 లక్షల రూపాయలతో పాఠశాలను కార్పొరేట్ స్కూల్‌కు దీటుగా ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేయడం జిల్లాలో మొదటిసారి అని ఈ సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావును, పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఎం ఎస్ అనురాధ, విద్య వాలంటరీలు రోజా, భాగ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.