బాన్సువాడ, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలని రాష్ట్ర శాసన సభ పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు.
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని చెప్పారు. బిడ్డ పుట్టిన అరగంట నుంచి రెండేళ్లపాటు బిడ్డకు తల్లిపాలను అందిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతోందని సూచించారు. బిడ్డకు భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు దరిచేరవని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రిలో వంద శాతం ప్రసవాలు అయ్యేవిధంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ శిబిరంలో 97 మంది ఆరోగ్య కార్యకర్తలు, 80 మంది ఆశా కార్యకర్తలు, 33 మంది పారా మెడికల్ సిబ్బంది సేవలు అందిస్తున్నారని చెప్పారు.
మెగా వైద్య శిబిరాన్ని బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తోందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుపేదలకు ఉచితంగా అన్ని రకాలు పరీక్షలు, వైద్య సేవలు ఈ శిబిరం ద్వారా అందుతున్నాయని పేర్కొన్నారు.
కాన్పుల మధ్య రెండు సంవత్సరాల అంతర పాటించాలని కోరారు. జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడారు. రసాయన మందులు వాడిన కూరగాయలు, పండ్లు తినవద్దని సూచించారు. సేంద్రియ ఎరువులు వాడిన కూరగాయలు, పండ్లు తినడం ద్వారా ఆరోగ్య సంరక్షణ జరుగుతుందని పేర్కొన్నారు.
శిబిరంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, పర్యవేక్షకులు శ్రీనివాస్ ప్రసాద్, విజయలక్ష్మి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆర్డీవో రాజా గౌడ్, సహకార సంఘం చైర్మన్ కిష్టారెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు.