నిజామాబాద్, ఏప్రిల్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారులందరికీ రుణ సదుపాయం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 24 నుండి మే 1వ తేదీ వరకు ‘కిసాన్ భాగిదారి – ప్రాథమిక్తా హమారీ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
లబ్దిదారులకు రుణ పంపిణీ ఏర్పాట్లపై కలెక్టర్ శుక్రవారం సంబంధిత అధికారులతో చర్చించారు. పి ఎమ్ కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయాల్సిందిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులను ఆదేశించిందని కలెక్టర్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరిస్తూ ఆయా బ్యాంకులు ప్రత్యేక శిఖరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ శిబిరాలలో వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు సైతం పాల్గొని బ్యాంకు అధికారులతో కలిసి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా అర్హులైన వారి నుండి దరఖాస్తులను స్వీకరించి, వాటిని పరిశీలించి వారం రోజుల్లోగా కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తారని కలెక్టర్ వివరించారు.
ఈ కార్డుల ద్వారా ఎటువంటి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ వంటివి లేకుండానే పీఎం కిసాన్ లబ్ధిదారులు మూడు లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం పొందవచ్చని సూచించారు. కలెక్టర్‌తో సమావేశం అయిన వారిలో లీడ్ బ్యాంక్ మేనేజర్ యు. శ్రీనివాస్ రావు, నాబార్డు ఏజీఎం కె.నాగేష్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తదితరులు ఉన్నారు.