నిజామాబాద్, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌లు ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
మొత్తం 75 అర్జీలు రాగా, వాటిని పరిష్కరించాల్సిందిగా సూచిస్తూ సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో సమస్యలను విన్నవిస్తే పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ప్రజలు వ్యయప్రయాసలు కోర్చి ప్రగతి భవన్‌కు తరలివచ్చి వినతులు అందజేస్తారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులందరూ హాజరు ప్రజావాణిలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, మన ఊరు – మన బడి కార్యక్రమం కింద 61 పాఠశాలల్లో ప్రతిపాదనలకు అనుమతులు జారీ చేసినందున తక్షణమే పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచించారు. దళితబంధు రెండవ విడత కార్యక్రమం అమలు కోసం సన్నద్ధమై ఉండాలని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా నిరుద్యోగ యువతకు అందిస్తున్న ముందస్తు శిక్షణ తరగతులు పకడ్బందీగా జరిగేలా పర్యవేక్షణ జరపాలని, నిష్ణాతులైన అధ్యాపకులచే బోధనా జరిగేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.