డిచ్‌పల్లి, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగానికి చెందిన ఒప్పంద సహాయ ఆచార్యుడు డా. వి. జలంధర్ రచించిన ‘‘గ్రాస్సెస్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్’’ అనే పుస్తకాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులందరు పరిశోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.
పరిశోధనా పత్రాలు, నూతన గ్రంథాలు ఆవిష్కరించాలని సూచించారు. జలంధర్ రచించిన గ్రాస్సెస్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అనే పుస్తకం పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రచయిత జలంధర్ తన పుస్తకంలో మొత్తము 155 గడ్డిజాతి మొక్కల గూర్చి వివరణ ఇచ్చారు. ఇందులో 87 గడ్డిజాతులను నిజామాబాద్ జిల్లా ఫ్లోరాకు అదనంగా గుర్తించారు.
గడ్డిజాతి మొక్కల గుర్తింపులో బిఎస్‌ఐ, హైద్రాబాద్‌కి చెందిన శాస్త్రవేత్త డా. జె. స్వామి సహకరించారు. కాగా పుస్తకాన్ని ఎ. అప్పయ్య సహకారంతో తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సౌజన్యంతో ముద్రించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉస్మానియా ప్రొఫెసర్ డా. జడ్సన్ విభాగాధిపతి ఆచార్య బి. విద్యావర్ధిని, డీన్ ఆచార్య ఎం. అరుణ, బీవోఎస్ డా. అహ్మద్ అబ్దుల్ హలీంఖాన్, డా. దేవరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా పుస్తక రచయిత జలంధర్‌ను పలువురు అభినందించారు.