నిజామాబాద్, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ జిల్లా వైద్య అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపారు.
గర్భిణీ స్త్రీల నమోదు, గర్భిణీ స్త్రీలలో రక్తహీనత, హైరిస్క్ గర్భిణీ స్త్రీల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆసుపత్రులలో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. గర్భం దాల్చిన ప్రతి ఒకరు ఆస్పత్రిలో తమ పేరు నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
గర్భం దాల్చిన నాటి నుంచి అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత సమస్య తలెత్తకుండా వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రసవాల సందర్భంగా మరణాల సంఖ్యను తగ్గించేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేసి గర్భిణీ స్త్రీల గురించి నమోదు ప్రత్యేక ను ఎప్పటికప్పుడు చేపట్టాలని వైద్య అధికారులకు తెలిపారు.
సాధారణ ప్రసవాలు సంఖ్య పెరిగేలా ఎప్పటికప్పుడు ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఐసిడిఎస్ సిబ్బంది, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ మాతా శిశు సంరక్షణ సేవలు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ కిట్టు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగాయని ఆమె అన్నారు.
గర్భిణీ స్త్రీలకు ప్రసవానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అదేవిధంగా కుటుంబ నియంత్రణ పై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఆసుపత్రుల పరిధులలో ఇంటింటికి వెళ్లి షుగర్, బీపీ తదితర పరీక్షలు 100 శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షయ, మలేరియా వంటి వ్యాధులకు సంబంధించి నమూనాల రిపోర్టులను ఆ సత్వరమే అందేలా చూడాలని అన్నారు.
వివిధ పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను ప్రింటెడ్ రూపంలో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య మెరుగుపర్చే దిశగా పనిచేస్తున్న వైద్యాధికారులను కమిషనర్ అభినందించారు. అదేవిధంగా, టీబీ నియంత్రణ కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా ప్రగతిని చాటుతూ సిల్వర్ మెడల్ సాధించడాన్ని ప్రస్తావిస్తూ, కలెక్టర్ నారాయణరెడ్డిని, స్థానిక అధికారులను అభినందించారు.
ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గోల్డ్ మెడల్ సాధించాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ తో కలిసి రాష్ట్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ జిల్లా జనరల్ ఆసుపత్రిని, అనుబంధ విభాగాలను పరిశీలించి, వైద్యాధికారులకు సూచనలు చేశారు. సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ఐ ఏ ఎస్ అధికారి మకరంద్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ సుదర్శనంతో పాటు వైద్య అధికారులు పాల్గొన్నారు.