కామారెడ్డి, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం ఉండేవిధంగా చూడాలన్నారు. జిల్లాలో ప్రథమ సంవత్సరం 9118, ఒకేషనల్ 1234 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 8183, ఒకేషనల్ 1025 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. మొత్తం 19,560 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, నోడల్ అధికారి షేక్ సలాం, అధికారులు అజ్మల్ ఖాన్, డాక్టర్ నిజాం, బుద్ధిరాజు పాల్గొన్నారు.