కామారెడ్డి, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు బిందు సేద్యం ఏర్పాటు చేసుకుని నాణ్యమైన పంట దిగుబడులను పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సోమవారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిందు సేద్యం పరికరాలను ఏర్పాటు చేశారు. బిందు సేద్యం స్టాళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం రాయితీపై బిందు సేద్యం పరికరాలను రైతులకు అందజేస్తోందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బిందుసేద్యం ద్వారా వేరు దగ్గర సమపాళ్లలో నీటిని బొట్టు బొట్టుగా అందించవచ్చని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ తోటలను జిల్లా రైతులు సాగు చేసుకోవాలని కోరారు. అన్ని రకాల నేలలు ఈ పంట సాగుకు అనుకూలమని చెప్పారు.
సంవత్సరం పొడుగునా నీటి వసతి కల్పించాలని పేర్కొన్నారు. ఈ పంటను పురుగులు, తెగుళ్ళు ఆశించని చెప్పారు. కోతులు, అడవి పందుల బెడద ఉండబోదని స్పష్టం చేశారు. సిరిధాన్యాల సాగు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి సంజీవ రావు, అధికారులు రాజా గౌడ్, బాపురెడ్డి పాల్గొన్నారు.