నిజామాబాద్, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇకపై కాన్పులన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సీ.నారాయణరెడ్డి వైద్యాధికారులు, సిబ్బంది, ఆశా వర్కర్లకు సూచించారు. సరైన కారణం లేకుండా ఎవరైనా గర్భీణీలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకున్నట్లైతే, సంబంధిత ప్రాంత ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లను బాధ్యులుగా పరిగణిస్తూ చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు.
నూటికి నూరు శాతం ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని, అది కూడా సిజీరియన్ ఆపరేషన్లు కాకుండా సాధారణ కాన్పులు జరగాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఇందల్వాయి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సిలోని ఇన్ పేషంట్ వార్డ్, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టిక తనిఖీ చేసి, అందుబాటులో లేని వారి గురించి ఆరా తీశారు. వైద్య సేవల కోసం పిహెచ్‌సికి వచ్చిన గర్భిణీ మహిళలకు స్థానికంగా అందుతున్న వైద్య సేవల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వైద్యాధికారులు, సిబ్బందిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటు హాస్పిటల్స్‌లో అధిక శాతం సీజీరియన్ ఆపరేషన్స్ చేస్తున్నారని అన్నారు. దీనివల్ల ప్రజలపై అనవసర ఆర్థిక భారం పడడమే కాకుండా గర్భిణీ మహిళల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోందన్నారు.
ఈ విషయాలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు వివరిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకునేలా చూడాలన్నారు. ముఖ్యంగా మహిళ గర్భం దాల్చిన నాటి నుండి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగేంత వరకు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ప్రభుత్వాసుపత్రిలో కాన్పు చేయించుకుంటే కలిగే ప్రయోజనాలను తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో నార్మల్ డెలివరీలకు ఎక్కువ అవకాశం ఉండడంతో పాటు పూర్తి ఉచితంగా చికిత్స అందుతుందని అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ కిట్ కింద ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందిస్తున్నామని గుర్తు చేశారు. ఈ అంశాలను వివరిస్తూ గర్భిణీలు నూటికి నూరు శాతం ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.