కామారెడ్డి, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులతో ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష నిర్వహించారు.
గ్రామాల్లో కూలీలకు అవసరమైన పనులను గుర్తించి, పనులు జరిగే విధంగా చూడాలని చెప్పారు. మండలాల వారీగా కూలీల సంఖ్య వివరాలు, చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూమి అభివృద్ధి పనులు, ఉట చెరువుల నిర్మాణం వంటి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మాట్లాడారు.
గ్రామాల్లోని నర్సరీలో 100 శాతం మొక్కలు జీవించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గన్నేరు, పారిజాత, టేకోమా వంటి అంటు మొక్కలను నర్సరీల్లో పెంచాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఇంచార్జ్ డిపిఓ సాయిబాబా, ఉపాధి హామీ ఏపీడి శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు.