కామారెడ్డి, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భిణీలు రక్తహీనత సమస్య తలెత్తకుండా వైద్య సేవలను అందించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ నమోదు, రక్తహీనత, హైరిస్క్ గర్భిణీల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి మంగళవారం సమీక్షించారు.
ప్రభుత్వ ఆరోగ్య పథకాలు అమలు, వైద్య సేవలు, ఆరోగ్య కేంద్రాల వారీగా ప్రసవాలు, కెసిఆర్ కిట్ గురించి సమీక్ష జరిపారు. ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని రకాల జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల గురించి చర్చించారు. గర్భిణీలకు ప్రసవానంతరం తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
అంకితభావంతో వైద్య సేవలు అందించిన పుల్కల్ వైద్యాధికారి మమత ను అభినందించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ అనీమియా ఉన్న పిల్లలు జిల్లాలో 410 మంది ఉండగా వారికి పౌష్టికాహారం అందించి 15 మందికి తగ్గించామని చెప్పారు. మిషన్ ఇంద్రధనస్సు టీకాలు పిల్లలకు 100 శాతం ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, డిప్యూటీ డిఎంఅండ్హెచ్‌ఓలు చంద్రశేఖర్, మోహన్ బాబు, శోభరాణి పాల్గొన్నారు.