ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే సహించే ప్రసక్తే లేదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అస్తవ్యస్తంగా తయారైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరులో మార్పు తప్పనిసరిగా రావాల్సిందేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు. విధుల పట్ల ఎవరైనా అలసత్వం వహిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఎంత మాత్రం ఉపేక్షించబోమని ఘాటుగా హెచ్చరించారు. పని చేయడం ఇష్టం లేకపోతే విధుల నుండి పక్కకు తప్పుకోవాలని కరాఖండిగా తేల్చి చెప్పారు. ఇకపై తన అనుమతి లేకుండా వైద్యాధికారులు మొదలుకొని డాక్టర్‌ల వరకు ఏ ఒక్కరు కూడా సెలవు పెట్టడానికి వీలు లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

నెల రోజుల వ్యవధిలో శాఖ పనితీరులో స్పష్టమైన ప్రగతి కనిపించాలని, అలా జరగని పక్షంలో సంబంధిత విభాగాల అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు చేపట్టేందుకు ఎంత మాత్రం వెనుకాడబోమని కలెక్టర్‌ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో కలెక్టర్‌ వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వైద్య శాఖ పనితీరు ఆక్షేపణీయంగా మారిందని అసంతృప్తి వెలిబుచ్చారు.

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల రేటు రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లాలో ఎంతో తక్కువగా ఉందని అన్నారు. అలాగే సిజేరియన్‌ ఆపరేషన్ల విషయంలో రాష్ట్ర సగటు కంటే జిల్లాలో ఎక్కువగా సిజేరియన్‌లు జరుగుతున్నాయని గణాంకాలను వెల్లడిరచారు. ఈ ధోరణి ఎంత మాత్రం సమంజసం కాదని, ఎవరికి వారు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ పరిస్థితిలో స్పష్టమైన మార్పు వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం 44 శాతం మాత్రమే కాన్పులు జరుగుతున్నాయని, మిగతా 66 శాతం ప్రసవాలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయన్నారు.

సిజేరియన్‌ల పరంగా చూస్తే రాష్ట్రంలో సగటున 56 శాతం ఉండగా, జిల్లాలో ఏకంగా 77 శాతం సిజేరియన్‌ ఆపరేషన్‌లు జరుగుతున్నాయని అన్నారు. ఇకనుండి ప్రసవాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, వైద్యాధికారులు, ఆయా విభాగాల సిబ్బంది సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ సత్ఫలితాలు సాధించాలని సూచించారు.

కరోనా తీవ్రత కారణంగా వైద్యశాఖ పనితీరుపై అంతగా దృష్టి పెట్టలేక పోయానని, ఇకనుండి స్వయంగా తానే క్రమం తప్పకుండా ప్రగతిని సమీక్షిస్తానని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఏ ఒక్క విషయంలోనూ ఎవరైనా నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే సస్పెన్షన్‌, సరెండర్‌ చేసేందుకు వెనుకాడబోనని కలెక్టర్‌ హెచ్చరించారు. ఆశా వర్కర్ల నుండి మొదలుకొని వైద్య అధికారుల వరకు అందరి హాజరును ఆన్లైన్‌ పద్ధతిలో తీసుకోవడం జరుగుతుందని, దాని ఆధారంగానే జీతాల బిల్లులు మంజూరు చేయిస్తామన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలయ్యే అన్ని కార్యక్రమాల్లోనూ నూటికి నూరు శాతం ప్రగతి సాధించాల్సిందేనని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌, ఆస్పత్రులకు పంపించకూడదని అత్యవసరమైతే తప్ప సిజేరియన్‌ ఆపరేషన్లు చేయకూడదని సూచించారు. గత మార్చి నెల ఒకటవ తేదీ నుండి మొదలుకొని ఇప్పటివరకు జిల్లాలో ప్రైవేట్‌, ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగిన సాధారణ ప్రసవాలు, సిజేరియన్‌ ఆపరేషన్‌ల పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ వైద్యశాలల ద్వారా మెరుగైన సేవలందిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని హితవు పలికారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి రaాన్సీ, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, వివిధ విభాగాల వైద్యాధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Check Also

అమ్మ ఆదర్శ పాఠశాలలో పనుల తనిఖీ

Print 🖨 PDF 📄 eBook 📱 మాక్లూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »