డిచ్‌పల్లి, ఏప్రిల్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మంగళవారం వివిధ కళాశాలలను సందర్శించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాల, కంప్యూటర్ సైన్స్ కళాశాల, న్యాయ కళాశాలలను పర్యవేక్షించారు.
ఈ విద్యా సంవత్సరానికి పాఠ్యబోధనా తరగతులు దగ్గర పడుతుండడం వల్ల వీసీ అన్ని కళాశాలలను తిరిగి సందర్శించారు. వివిధ తరగతి గదులకు వెళ్లి అధ్యాపకుల పాఠ్యబోధనను గమనించారు. విద్యార్థులకు ప్రత్యేకంగా వారి వారి పాఠ్యాంశాలలో గల ఆసక్తిదాయకమైన అంశాలను గూర్చి తెలుసుకున్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలకు తగిన విధంగా ప్రిపేర్ అయ్యి త్వరలో జరుగబోయే సెమిస్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు.
వివిధ విభాగాల వారిగా పర్యవేక్షిస్తూ అధ్యాపకుల రూపొందించిన పాఠ్యప్రాణాళికలలో నూతన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అకడమిక్ రికార్డులను పరిశీంచారు. అధ్యాపకులు, విద్యార్థుల హాజరు శాతం గూర్చి అడిగి తెలుసుకున్నారు. సైన్స్ అండ్ కంప్యూటర్ లాబ్స్ సందర్శించి పరిశోధనాంశాలను గూర్చి పేర్కొన్నారు. ప్రాక్టికల్స్ లో విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా తగు శిక్షణ ఇవ్వాలని అన్నారు. విద్యార్థులకు క్యాంపస్ చదువు పాఠ్యాంశాలతో పాటుగా వ్యక్తిత్వ మానసిక వికాస వృద్ధికి కృషి చేయాలని అన్నారు.