నిజామాబాద్, ఏప్రిల్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంప్లాయిస్, పెన్షనర్స్, జర్నలిస్టుల హెల్త్ కార్డులపై , నగదు రహిత వైద్యం చేయడానికి ప్రయివేట్ అండ్ కార్పొరేట్ ఆసుపత్రులు నిరా కరిస్తున్నాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, ప్రధాన కార్యదర్శి కే .రామ్మోహన్రావు తెలిపారు. పనికిరాని ఈ హెల్త్ కార్డులెందుకని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు వాపోతున్నారు.
మొదట్లో కార్పోరేట్, ప్రయివేట్ హాస్పిటల్స్ ఇహెచ్‌ఎస్‌పై వైద్యం చేసి బిల్లులను ప్రభుత్వం నుండి రీ -ఎంబర్స్ చేసుకునేవారు. కానీ ప్రస్తుతం వారికి సకాలంలో రియంబర్స్‌మెంట్ రావడం లేదని చెబుతూ హాస్పిటల్స్ ఇహెచ్‌ఎస్‌పై వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నాయి. ఒక కంటి, పంటి హాస్పిటల్స్ మాత్రమే ఇహెచ్‌ఎస్‌పై వైద్యం చేస్తున్నాయి. డబ్బులు రావటం లేదని వారు కూడా ఈ మధ్య వైద్యాన్ని నిలిపివేస్తున్నారు.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉద్యోగులకు, పెన్షనర్లకు ,ఉచిత నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. కావున మనరాష్ట్రలో కూడా ఇహెచ్‌ఎస్‌పై ఉచితంగానే నాణ్యమైన వైద్య సేవలు అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ అందించాలని డిమాండ్ చేస్తున్నాము. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఇహెచ్‌ఎస్ క్రింద ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.
కానీ ప్రస్తుతం ప్రయివేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఇహెచ్‌ఎస్‌పై వైద్యం చేయడం లేదు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని కార్పొరేట్ ఆస్పత్రులలో నగదు రహిత వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీం, వెల్నెస్ సెంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, డాక్టర్లను పర్మినెంట్ చేయాలని తమ సంఘం డిమాండ్ చేస్తుందని ప్రధాన కార్యదర్శి కె .రామ్మోహన్ రావు తెలిపారు.