నిజామాబాద్, ఏప్రిల్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దొడ్డు రకం వరి ధాన్యం దిగుమతి చేసుకునేందుకు నిరాకరించే మిల్లులకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం నిల్వలు పంపడాన్ని పూర్తిగా నిలిపివేస్తామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా సదరు రైస్ మిల్లులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం సాయంత్రం ధాన్యం సేకరణ, మిల్లింగ్ కు తరలింపు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పలుచోట్ల కొంతమంది రైస్ మిల్లర్లు సన్నరకం ధాన్యాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంటున్నారని, దొడ్డు రకం ధాన్యం లోడుతో ఉన్న లారీలను అలాగే నిలిపివేస్తున్నారనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని, సన్నాలతో పాటు దొడ్డు రకం ధాన్యాన్ని కూడా తప్పనిసరిగా దిగుమతి చేసుకొని మిల్లింగ్ చేయాల్సిందేనని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఇందుకు నిరాకరిస్తే సదరు రైస్ మిల్లులకు మిల్లింగ్ చేసేందుకు అనుమతించకూడదని అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ విషయంలో తహసిల్దార్‌లు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. రైస్ మిల్లులకు తప్పనిసరిగా 50 శాతం దొడ్డు రకం, మరో 50 శాతం సన్న రకం ధాన్యం మిల్లింగ్ కోసం పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుండి ధాన్యం త్వరితగతిన సేకరిస్తూ, వెంటది వెంట నిర్ణయించిన రైస్ మిల్లులకు పంపించేలా చూడాలన్నారు. ఈ ప్రక్రియను వేగవంతంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతిరోజు కనీసం పదహారు వందల వాహనాల్లో ధాన్యం రైస్ మిల్లులకు తరలించేలా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని, సమిష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంత మాత్రం ఉపేక్షించబోమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ చిన్న ఫిర్యాదుకు సైతం ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.