నిజామాబాద్, ఏప్రిల్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరవుతున్న క్రమంలో ఆయన పర్యటన ఏర్పాట్లను గురువారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు పరిశీలించారు. నిజాంసాగర్ మెయిన్ కెనాల్‌ను ఆధారంగా చేసుకుని సుమారు 106 కోట్ల రూపాయల వ్యయంతో జాకోరా, చందూర్ గ్రామాల వద్ద చేపడుతున్న ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు శుక్రవారం మంత్రి హరీష్ రావు శంకుస్థాపనలు చేయనున్నారు.
జాకోరా వద్ద బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, సి పి నాగరాజు జాకోరాను సందర్శించి ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. సభా ప్రాంగణం, వేదిక, విఐపి గ్యాలరీ, శంకుస్థాపన శిలాఫలకాలు తదితర వాటిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శంకుస్థాపనల శిలాఫలకాల వద్ద ఎత్తిపోతల పథకాల గురించి తెలియజేసే ప్రాజెక్టు వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున తాగునీటి వసతిని ఎక్కువ పరిమాణంలో అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. వీరి వెంట డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బోధన్ ఆర్డిఓ రాజేశ్వర్, ఏసీపీ రామారావు తదితరులు ఉన్నారు.