ఆర్మూర్, ఏప్రిల్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం అన్ని కులాల,మతాల సమ్మిళితమని రాష్ట్ర రోడ్లు-భవనాలు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవించి బతుకమ్మ, క్రిస్మస్,రంజాన్ లాంటి పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని ఈ సందర్బంగా తెలిపారు. పేద ముస్లిం ఇండ్లలో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని షాదిముబారక్ కింద లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు.
పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం 204 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పారని గుర్తు చేశారు.ఒక్కో పాఠశాల లో 400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, ఒక్కో విద్యార్థి మీద 1లక్ష 25 వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నదని తెలిపారు. పేద మైనార్టీ పిల్లలు ప్రతిభలో ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉన్నతంగా తీర్చబడుతున్నారని చెప్పారు.
కుల,మత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేసిఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు పలువురు పాల్గొన్నారు.