బాన్సువాడ, ఏప్రిల్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం సేద్యపు రంగానికి పూర్తి బాసటగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో తెలంగాణలో సాగు రంగం గణనీయంగా వృద్ధి చెంది దక్షిణ భారత దేశం మొత్తానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని అన్నారు.
నిజాంసాగర్ ప్రధాన కాల్వను ఆధారంగా చేసుకుని సుమారు నాలుగు వేల ఎకరాల నాన్ కమాండ్ ఆయకట్టు పంటలకు సాగు జలాలు అందించేందుకు వీలుగా నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా వద్ద 69 .52 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి శుక్రవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జాకోరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణాలో వ్యవసాయ రంగం పండుగగా మారిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు 99 లక్షల టన్నుల వరి పంట పండేదని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటు వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో 2 కోట్ల 59 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే ఇది సాధ్యమైందని, తెలంగాణాలో పండుతున్న ధాన్యం రాశులను చూసి కేంద్ర మంత్రులే ఆశ్చర్యపోతున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
గత 70 ఏళ్లలో సాగు రంగంలో అభివృద్ధి స్థంభించిపోగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణా వడివడిగా ప్రగతిని సాధిస్తూ యావత్ దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఇదివరకు తెలంగాణాలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, ఎరువుల కోసం గంటల తరబడి రైతులు క్యూ లైన్లలో నిలబడితే ఒకటీ అరా ఎరువు బస్తా అతికష్టం మీద లభించేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్నదాతకు కష్టం రాకూడదనే కృత నిశ్చయంతో సీఎం కేసీఆర్ సేద్యానికి ఇతోధికంగా చేయూతనందిస్తున్నారని అన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బరిలో నిలిచి గెలవాలనే సంకల్పంతో, రైతు ఏ చిన్న కష్టం రాకూడదనే తపనతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతోందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం నిర్మించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కాళేశ్వరం నీటిని మల్లన్నసాగర్ లోకి మళ్లించి, అక్కడినుండి హల్దీవాగు ద్వారా నిజాంసాగర్ నింపడం జరుగుతుందన్నారు.
నిజాంసాగర్, సింగూర్ జలాశయాలకు నీటి రంధి దూరం అయినందునే సాగర్ ప్రధాన కాలువ నీటిని ఆధారంగా చేసుకుని జాకోరా, చందూర్ లిఫ్టులను నిర్మిస్తున్నామని, వీటి వల్ల సుమారు 12 వేల ఎకరాల నాన్ కమాండ్ ఏరియా ఆయకట్టుకు సాగు నీరు అందనుందని తెలిపారు. వర్షాలు అనుకూలించినా, కాలం కాకపోయినా నిజాంసాగర్, సింగూర్ ప్రాజెక్టులు నిండు కుండల్లా ఉంటాయన్నారు. ఇలా ప్రాజెక్టుల నిర్మాణాలు ఒకవైపు, పంట పెట్టుబడి రూపేణా రైతు బంధు కింద ఎకరాకు పది వేల రూపాయలు, రైతు బీమా, ఇరువై నాలుగు గంటల ఉచిత విద్యుత్ అమలు వంటి వాటితో తెలంగాణాలో సేద్యపు రంగంలో ఉత్పత్తుల సాగు రెండిరతలకు పైగా పెరిగిందన్నారు.
రైతాంగ ప్రయోజనాలతో పాటు ఆసరా పథకం కింద 2016 రూపాయలు అందిస్తున్నామని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్షా 116 రూపాయలను మంజూరు చేస్తున్నామని అన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.గడిచిన ఏడేళ్ల వ్యవధిలోనే లక్షా 32 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. తాజాగా ప్రస్తుతం 91 వేల ఉద్యోగ ఖాళీలను ఏకకాలంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌లు జారీ చేస్తోందని గుర్తు చేశారు.
ఇకపై ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తూ యేటేటా ఖాళీలను భర్తీ చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. కాగా, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మలిచేందుకు మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపట్టి ఏడు వేల కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని, డిజిటల్ క్లాస్ రూంలు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ బడులలో ఆంగ్ల మాధ్యమంలో బోధన అమలులోకి రానుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని సూచించారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని, పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి గుంట భూమికి సాగు నీటిని అందించడమే లక్ష్యంగా నిజాంసాగర్ నాన్ కమాండ్ ఆయకట్టు పంటలకు సాగు జలాల కోసం ఎత్తిపోతల పథకాలను నిర్మింపజేస్తున్నామని అన్నారు.
గత ఫిబ్రవరిలో 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా సిద్ధాపూర్ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించుకోగా, ప్రస్తుతం జాకోరా, చందూర్, చింతకుంట ఎత్తిపోతల పథకాల కింద మరో 12 వేల ఎకరాల నాన్ కమాండ్ ఏరియా ఆయకట్టుకు నిజాంసాగర్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు పంట పొలాల్లో పారనున్నాయని పేర్కొన్నారు. ఈ పథకాల వల్ల ఆయకట్టు రైతులు రెండు పంటలు సాగు చేస్తూ సంవత్సరానికి కనీసం 250 కోట్ల రూపాయల విలువ చేసే పంటలను ఉత్పత్తి చేస్తారని పోచారం ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతాంగ ప్రయోజనాలను వివరిస్తూ ఎత్తిపోతల పథకాలకు కోరిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరీ తెలిపారని ఈ సందర్భంగా స్పీకర్ పోచారం , ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతులు డబ్బులను వృధాగా ఖర్చు చేసుకోకూడని హితవు పలికారు. ఆర్మూర్ ప్రాంత రైతుల తరహాలోనే డబ్బులను తమ కుటుంబం లోని భార్య లేదా తల్లికి అప్పగించాలని, అప్పుడు డబ్బులు బాగా ఆదా చేసుకోగలుగుతారని సూచించారు.
రైతులు బ్యాంకుల నుండి అప్పు తీసుకునే పరిస్థితి దూరం కావాలని, సొంత పెట్టుబడితోనే పంటలు సాగు చేసే స్థాయికి అందరు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని, పంటల మార్పిడి వైపు దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభసాటిగా ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పరిషత్‌ల ఛైర్పర్సన్‌లు దాదన్నగారి విట్టల్ రావు, దఫేదర్ శోభ, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జీవన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, డీసీసీబీ చరిమం పోచారం భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్‌ఎం బి రాజేశ్వర్, ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లు శ్రీనివాస్, మధుసూదన్, హరిదాసు, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.