నిజామాబాద్, ఏప్రిల్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం సేకరణ, ఉపాధి హామీ పథకం, మన ఊరు – మన బడి, ధరణి కార్యక్రమాల అమలులో ప్రగతి గురించి సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరి కోతలు పూర్తయి చాలా చోట్ల ధాన్యం కుప్పలు ఎక్కడికక్కడ రోడ్లపై ఉన్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా అవసరం అయిన అన్ని చోట్లా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. రైతులు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం జరిగేలా చూడాలని సూచించారు. ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు.
సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, ధాన్యం లోడ్ ను మిల్లర్లు నిర్ణీత సమయంలోగా దించుకునేలా పర్యవేక్షణ చేయాలని తహసీల్దార్ లను ఆదేశించారు. బిల్లుల సత్వర చెల్లింపుల కోసం ధాన్యం కొనుగోలు వివరాలు వెంటవెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతినిత్యం ఆయా కేంద్రాల నుండి లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం మిల్లులకు రవాణా అయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. అప్పుడే నిర్దేశిత గడువు లోపు ధాన్యాన్ని సేకరించగల్గుతామని కలెక్టర్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, మిల్లులకు తరలించే విషయం లో సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు.
కాగా, జూన్ రెండో వారం నుండి చేపట్టనున్న హరితహారం కార్యక్రమం కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని అన్నారు. నర్సరీలలో పెంచుతున్న మొక్కలతో పాటు, రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించేందుకు వారానికి కనీసం మూడు పర్యాయాలకు తగ్గకుండా నీటిని అందించాలన్నారు. ఎక్కడైనా ఒక్క మొక్క ఎండినా సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని హెచ్చరించారు.
కాగా, ధరణి పెండిరగ్ దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. మన ఊరు – మన బడి కార్యక్రమం కింద అనుమతులు మంజూరు చేసిన పాఠశాలల్లో తక్షణమే పనులు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఆర్డీవో చందర్, జెడ్పీ సీఈఓ గోవింద్, డీఈవో దుర్గాప్రసాద్, డీపీఓ డాక్టర్ జయసుధ, డీఎస్ ఓ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లైస్ డీఎం అభిషేక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.