నిజామాబాద్, ఏప్రిల్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల వద్ద, కాలువ గట్లపై పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని, పది శాతం కన్నా తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాలలో పచ్చదనం గణనీయంగా మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడం ఎనిమిదవ విడత హరితహారం కార్యక్రమంలో ప్రాధాన్యత అంశాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సూచించారు.
రానున్న తెలంగాణకు హరితహారం సీజన్ ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల కార్యదర్శులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ శుక్రవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ జిల్లా నుండి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న చర్యల గురించి వారు ప్రధాన కార్యదర్శి దృష్టికి తెచ్చారు. అవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క హరితహారం మొక్క ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీటిని అందించేలా ఏర్పాట్లు చేస్తూ, పకడ్బందీగా పర్యవేక్షణ జరిపిస్తున్నామని తెలిపారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, తెలంగాణలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోందని, దీనిని నిరంతరాయంగా చేపట్టాలని సూచించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభంతో 8వ విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు.
అందుకు తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సారి 19.54 కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటడం లక్ష్యంగా నిర్దారించినట్లు సీ.ఎస్ వెల్లడిరచారు. అన్ని సాగునీటి ప్రాజెక్టులు, కాలువ గట్ల వెంట పచ్చదనం పెంచటం అత్యంత ప్రాధాన్యత అంశమని, ఇందు కోసం వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ ను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో అతి తక్కువ అటవీ శాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళికతో పచ్చదనం పెంపు కార్యక్రమాలను చేపట్టాలని చీఫ్ సెక్రటరీ తెలిపారు. అన్ని రహదారుల వెంట బహుళ రహదారి వనాలు (మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్) అభివృద్ధి చేయాలని సూచించారు.
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు, కరీంనగర్ రాజీవ్ రహదారి సతరహాలో రాష్ట్రంలోని అన్ని రహదారుల వెంట సుందరమైన పచ్చదనం పెంచాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రకృతి వనాలకు మంచి స్పందన వస్తోందని, వీటిల్లో ఆశించదగ్గ విధంగా పచ్చదనం పెంచటం, మండలానికి కనీసం ఐదు బృహత్ పల్లె ప్రకృతి వనాలను పెంచటం లక్ష్యంగా పెట్టుకోవాలని చీఫ్ సెక్రటరీ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం ప్రతీ మున్సిపాలిటీకి ప్రణాళిక ఉండాలని చెప్పారు.
ఖాళీ స్థలాలను గుర్తించి, పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున హరితహారం మొక్కలకు వారంలో రెండు, మూడు సార్లు నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ జిల్లాలో కలెక్టర్ నేతత్వంలో జిల్లా అటవీ అధికారి, ఇరిగేషన్ అధికారి, ఇతర సంబంథిత అధికారులు ఒక టీమ్ గా హరితహారం ప్రణాళికలను పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రాంతాన్ని, అక్కడి నేల తత్వాన్ని బట్టి మొక్కలు నాటాలని, లెక్కల మీద ఆధార పడకుండా మొక్కలు నాటే శాతం పెంచటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.