ఆర్మూర్, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద గల ఆయిల్ పామ్ నర్సరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం సందర్శించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ సి.నారాయణ రెడ్డిలతో కలిసి నర్సరీలో పెరుగుతున్న ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించారు. మొక్కల పెంపకం కోసం అవలంభిస్తున్న పద్ధతుల గురించి, వాటి పంపిణీ కోసం రూపొందించిన ప్రణాళిక గురించి నర్సరీ నిర్వాహకులైన ప్రి యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైతులు సాంప్రదాయ పంటలకు బదులుగా అధిక లాభాలు అందించే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి మళ్ళించాలని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకంగా ఉంటుందని, దీని దీని ద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఈ మొక్కలు నాటితే నాలుగవ సంవత్సరం నుండి దిగుబడులు ప్రారంభం అవుతాయని, 35 నుండి 40 సంవత్సరాల వరకు ఈ మొక్క దిగుబడి రూపంలో ఆదాయాన్ని ఆర్జించి పెడుతుందన్నారు.
ఆయిల్ పామ్ వల్ల కలిగే లాభాలు గురించి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ, ఆసక్తి అనుకూల పరిస్థితులు కలిగి ఉన్న రైతులు దీనిని సాగు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం కూడా ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున రాయితీలను అందిస్తోందని అన్నారు. ఈ పంట దిగుబడిని మార్కెటింగ్ చేయడం కూడా ఎంతో సులభమని, ముందస్తుగానే ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు వచ్చి నిర్ణీత మద్దతు ధరకు కొనుగోలు చేసి తీసుకెళ్తాయన్నారు.
ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించి లాభాల బాటలో పయనించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆయన వెంట ఆప్కాబ్ చైర్మన్ గంగారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి దాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, డిసిఓ సింహాచలం తదితరులు ఉన్నారు.