నిజామాబాద్, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం తరహాలో చేపట్టి, పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నాటికి సకల సౌకర్యాలతో అలరారే విధంగా పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతూ పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం హైద్రాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో మన ఊరు మన బడి కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేసి ఒక యజ్ఞంలాగ, ఒక పండగలాగ చేపట్టి పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి పూర్తి చేయాలన్నారు. చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు స్వయంగా పర్యవేక్షించి పనులు వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు.
నాడు- నేడు అన్నట్లుగా, మరమ్మతులు చేయక ముందు, మరమ్మతులు పూర్తి అయ్యాక పాఠశాల ఫోటోలు, వీడియోలు తీయించి సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం నిర్వహించాల్సిందిగా సూచించారు. పనులు చేయడం ఎంత ముఖ్యమో, వాటి గురించి చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదని, పని అయ్యేకొద్ది నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు.
ఇప్పటికే కలెక్టర్లకు అడ్వాన్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. డైనింగ్ హాల్‌కు ఎక్కువ ఆర్భాటంగా కాకుండా కవర్డ్ షెడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రతి పాత నిర్మాణాన్ని అనవసరంగా కూలగొట్టి కొత్తగా కట్టాల్సిన అవసరం లేదని, అవసరమైన మేరకు మరమ్మతులు జరిపించి వినియోగంలోకి తేవాలని, తప్పనిసరి అయితేనే కొత్తగా నిర్మాణం చేయించాలన్నారు. అవసరమైన చోట అద్దె భవనాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పాఠశాల భవనాలకు మార్చాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 9123 పాఠశాలలను ఆధునీకరించి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు నిశ్చయించుకొన్నామని తెలిపారు. వాటన్నింటికి త్వరగా అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలన్నారు. పాఠశాలలు ప్రస్తుతం సెలవు ఉన్నందున త్వరగా పనులు చేపట్టి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి సిద్జం చేయాలని ఆదేశించారు.
చేపడుతున్న పనులకు అంచనాలు వేయించి పరిపాలన అనుమతులు మంజూరు చేయాలన్నారు. 30 లక్షల అంచనా వరకు ఉన్న వాటిని వెంటనే పనులు ప్రారంభించాలని అంతకు మించి అంచనాలు ఉంటే వారం లోపల టెండర్లు పిలిచి పనులు అప్పగించాలన్నారు. ఫర్నిచర్ ఇతర సదుపాయాల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నమూనాతో తయారు చేయించి పంపడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మండుటెండల్లో ఇంటర్, పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ మరమ్మత్తులు చేయించాల్సిన పాఠశాలలల్లో ఇప్పటి వరకు పరిపాలన అనుమతులు ఇవ్వడంలో జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, ఈ నెల 10వ తేదీ వరకు వంద శాతం పరిపాలన అనుమతులు పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. పనులు త్వరగా ప్రారంభించి పూర్తి చేయించాలని, నాణ్యతలో లోటు లేకుండా పర్యవేక్షణ చేయాల్సిందిగా సూచించారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించి పనులు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఆన్‌లైన్‌లో నిధుల మల్లింపుతో పాటు పలు ఇతర సాంకేతిక సమస్యలను మంత్రులు, సీఎస్ దృష్టికి తెచ్చారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎస్ పేర్కొన్నారు. కాగా, జిల్లాలో తొలి దఫాలో 407 పాఠశాలలను ఎంపిక చేయగా, వాటిలో ఇప్పటికే 147 బడులకు పరిపాలన అనుమతులు ఇచ్చి పనులు సకాలంలో పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సూచనలు అన్ని పాటించి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోగా పనులు పూర్తి చేస్తామని అన్నారు.
వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి
ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున, మన ఊరు మన బడి కార్యక్రమంతో పాటు వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్ లను కోరారు. మాతా శిశు మరణాల రేటు దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని, మరింతగా కృషి చేస్తూ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. అయితే వైద్య శాఖ ద్వారా అమలయ్యే ఇతర కొన్ని కార్యక్రమాల్లో వెనుకబడి ఉండడం వల్ల వైద్య ఆరోగ్య శాఖ మొత్తం అప్రతిష్టపాలు కావాల్సి వస్తుందన్నారు.
ప్రధానంగా సిజేరియన్ ఆపరేషన్‌ల విషయంలో దేశంలోనే అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడం ఆందోళన కలిగించే పరిణామంగా మారిందన్నారు. ఈ పరిస్థితిలో తప్పనిసరిగా మార్పు చేయాల్సిన అవసరం ఉందని, నూటికి నూరు శాతం సాధారణ కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగేలా ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే సిజేరియన్ కాన్పులపై పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రజల నుండి శాంపిల్స్ సేకరిస్తూ టీ.డయాగ్నొస్టిక్స్ సేవలపై దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరిస్తే, ప్రజలకు వైద్య సేవలు అందడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులు కూడా బలోపేతం అవుతాయని అన్నారు. ఆసుపత్రుల అభివృద్ధి కోసం ఉద్దేశించిన హెచ్‌డిఎస్ మొదటి త్రైమాసిక నిధులను పిహెచ్‌సి స్థాయి నుండి మొదలుకొని జిల్లా ఆస్పత్రి వరకు ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు.
ఈ నిధులను వెచ్చిస్తూ తాగునీటి వసతి , ఇతర మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ చూపాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలపై విమర్శలు రాకుండా నాణ్యమైన సేవలు అందించాలని హితవు పలికారు. 108, 102 సేవలను క్షుణ్ణంగా సమీక్షించాలని, ఏ ఒక్క ఆరోగ్యశ్రీ కేసు కూడా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి హరీష్ రావు సూచించారు.
కరోనా కారణంగా స్తంభించిపోయిన ఆర్‌బిఎస్‌కే సేవలను మళ్లీ యధాతధంగా పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫెరెన్స్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎంహెచ్‌ఓ సుదర్శనం, డీఈఓ దుర్గాప్రసాద్, విద్యా వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.