నిజామాబాద్, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా రవాణా వ్యవస్థలో అతి పెద్ద సంస్థగా పేరుగాంచిన టి.ఎస్.ఆర్.టి.సి సామాజిక సేవలోనూ తనవంతు పాత్ర పోషిస్తోంది. ఆర్‌టిసి సంస్థ అభ్యున్నతి దిశగా ఆలోచిస్తూనే సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, నిజామాబాదు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడిరచారు.
ఇటీవల కాలంలో ప్రజల నాలుకల్లో నానుతూ వస్తున్న సంస్థ మరో మారు కీలక నిర్ణయంతో ముందుకొచ్చింది. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగుల కోసం చక్కటి శుభవార్తను అందించింది. 20 శాత రాయితీ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసి సేవా భావాన్ని చాటుకుంది. ఇప్పటికే ఎన్నో ఆఫర్స్ ప్రకటించి ప్రజలకు మరింత చేరువైన సంస్థ మరోసారి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల నిరుద్యోగులు స్వాగతిస్తున్నారు.
ఈ సందర్భంగా టి.ఎస్.ఆర్టీసీ ఛైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, పేద అభ్యర్థులకు చేయూతను అందించాలనే ఉద్ధేశంతో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్‌లపై మూడు నెలలకు 20 శాతం రాయితీ ఇవ్వడం జరుగుతోందని వెల్లడిరచారు. ఈ ప్రత్యేక ఆఫర్ మూడు నెలల పాటు అందించనున్నట్లు చెబుతూ బస్ పాస్ పొందడానికి దరఖాస్తుకు సంతకం చేసిన ఆధార్ కార్డుతో పాటుగా కోచింగ్ సెంటర్ ఐడీ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన నిరుద్యోగ గుర్తింపు కార్డు జత చేయాల్సి ఉంటుందని వివరించారు.
సిటీ ఆర్డినరీ రూ.3450, ఎక్స్‌ప్రెస్ రూ.3900 ఉండగా పోటీ అభ్యర్థులకు 20 శాతం రాయితీ కల్పించిన తరువాత వరుసగా రూ.2800, రూ.3200 ఛార్జీలు ఉంటాయని తెలిపారు. ఈ రాయితీ మొదటి సందర్భంలో 6 నెలల పాటు కొనసాగుతుందని, శిక్షణ / కోచింగ్ తరగతులకు హాజరవుతున్న నిరుద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనం అని పేర్కొన్నారు. అన్ని బస్ పాస్ కౌంటర్లలలోనూ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.