నందిపేట్, మే 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముస్లింలు అత్యంత పవిత్రంగా కొలిచే రంజాన్ (ఈద్ -ఉల్-ఫితర్) పండగను మంగళవారం నందిపేట్ మండలంలోని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
నెల రోజుల పాటు మండుటెండలను సైతం లెక్కచేయకుండా కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు సోమవారం సాయంత్రం పర్వాలు చంద్ర దర్శనం సమాచారంతో ఉపవాస దీక్షలు విరమించి మంగళవారం (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినాన్ని జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. దీంతో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న ముస్లింలు మంగళవారం ఉదయం కొత్త బట్టలు ధరించి సామూహికంగా తక్బీర్ పటిస్తూ గ్రామాల సమీపంలోని ఈద్గాల వద్ద చేరుకుని ఫేస్ ఇమామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలింగనంతో ఈద్ ముబారక్ అంటూ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
నందిపేట్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఫేస్ ఇమామ్ (హఫీజేఖురాన్) ఆధ్వర్యంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మండలంలోని డొంకేశ్వర్, ఖుదవందపూర్, వివిధ గ్రామాలలోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ పండగ సందర్భంగా మండలంలోని సర్పంచులు, పార్టీల నాయకులు, అధికారులు, ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ పండగ ప్రత్యేక ప్రార్థన సందర్భంగా ఈద్గాల వద్ద నందిపేట్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అనంతరం పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపిపి సంతోష్, జడ్‌పిటిసి ఎర్రం యమున ముత్యం, నందిపేట్ సర్పంచ్ ఎస్‌జి వాణి తిరుపతి, కో అప్సన్ మెంబెర్ సయ్యద్ హుస్సేన్, మండల ముస్లిం కమిటీ నాయకులు కాలీమ్, గౌస్ తదితరులు మండల ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.