డిచ్‌పల్లి, మే 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విజ్ఞాన సౌధ (సెంట్రల్ లైబ్రరీ) కి తెలంగాణ బి.ఎడ్. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అల్వాల మధుసూదన్ టీచర్స్ ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించిన పుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. మొదట రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్‌ను కలిసి శ్రీ అను పబ్లికేషన్స్ వారి బి.ఎడ్. ఉచిత పుస్తకాల ప్రచురణలు అందించారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ… అల్వాల్ మధుసూదన్ తెలంగాణ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థుల కోసం పుస్తకాలను అందించడం వారి ఉదార స్వభావానికి నిదర్శనమని అన్నారు. శ్రీ అను పబ్లికేషన్స్ ద్వారా ప్రముఖ పోటీ పరీక్షల రచయిత పొన్నగంటి శివయ్య రచించిన డిఎస్సీ కోచింగ్ మెటీరియల్ ఎంతో ఉపయుక్త దాయకమని ప్రశంసించారు. విద్యార్థులు వీటిని వినియోగించుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని సూచించారు.
ఆర్థిక శాస్త్ర విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ డా. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల కోసం ఇటువంటి స్వచ్చంధ కార్యక్రమాలలో భాగంగా పుస్తకాలను పంపిణీ చేయడం సంతోషదాయకం అన్నారు. అల్వాల్ మధుసూదన్ ఒక సామాజిక ఉద్యమ కర్త అని తెలంగాణ యువత ఉద్యోగ ప్రకటనల సాధన కోసం శ్రమించారు అన్నారు.
నిజామాబాద్ ఎస్సీ కార్పొరేషన్ డెవలప్ మెంట్ ఆఫీసర్ చౌతి భూమేష్ మాట్లాడుతూ అల్వాల్ మధుసూదన్ తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో గ్రంథాలయాలకు పుస్తకాలను పంపిణీ చేస్తున్నారన్నారు. బి.ఎడ్. సారంగాపూర్ క్యాంపస్‌లో కూడా ఉచితంగా పుస్తకాలను అందించారని అన్నారు. మధుసూదన్ మాట్లాడుతూ బి.ఎడ్. పుస్తకాలతో పాటు ఇతర కాంపిటీటివ్ పుస్తకాలను కూడా అందించాలని సంకల్పించుకున్నట్లు తెలిపారు. త్వరలో బి.ఎడ్. ప్రశ్నాపత్రాలను, పోలీస్ రిక్రూట్ మెంట్‌కు చెందిన ఎస్సై, కానిస్టేబుల్ మెటీరియల్ అందించనున్నట్లు పేర్కొన్నారు.