కామారెడ్డి, మే 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో సీ-సెక్షన్లను తగ్గించి, సహజ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వందశాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సాధారణ ప్రసవాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, గర్భిణుల నమోదు, ఏఎన్‌సి చెకప్, క్షయ వ్యాధి నిర్మూలన అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారీగా ఏఎన్‌సి రిజిస్ట్రేషన్‌లు, చెకప్‌లపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తరచూ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. సి – సెక్షన్లు నిర్వహించిన కేసులకు సంబంధించి రిపోర్ట్‌ను ఆడిట్ చేయాలన్నారు. అనవసరంగా సీజెరియన్ లు నిర్వహించే ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో వంద శాతం గర్భిణీ ల నమోదు, ఏఎన్‌సి – గర్భిణీ పరీక్షలు పరీక్షలు క్రమం తప్పకుండా చేపట్టాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారితో పాటు స్టాఫ్ నర్స్‌లు సైతం సహజ ప్రసవాలు జరిగేలా గర్భిణులు నమోదు, చెకప్ వందశాతం జరిగేలా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే రోజే రక్త హీనత కేసులపై దృష్టి సారించాలన్నారు.
ఎనీమియాతో బాధపడుతున్న గర్భిణీలకు అదనంగా పౌష్టికాహారం అందించాలని సూచించారు. జిల్లాను రక్త హీనత లేని జిల్లాగా తీర్చి దిద్దాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే,జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు చంద్రశేఖర్, మోహన్ బాబు, శోభారాణి ఇమ్మ్యూనైజేషన్ అధికారి అనిల్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.