కామారెడ్డి, మే 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు భద్రత నియమ నిబంధనలపై అవగాహన కల్పించాలని రోడ్స్, రైల్వేస్ అడిషనల్ డిజిపి సందీప్ శాండిల్య అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం రహదారి భద్రత మన అందరి బాధ్యత అనే అంశంపై అవగాహన సదస్సులో మాట్లాడారు.
నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయని చెప్పారు. విలువైన ప్రాణాలు క్షణాలలో గాలిలో కలిసిపోతున్నాయని తెలిపారు. రోడ్డు భద్రత విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మన కుటుంబం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రశాంతంగా జీవించవచ్చని పేర్కొన్నారు.
పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను ఎక్కించుకో వద్దని సూచించారు. రాంగ్ రూట్‌లో వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, నిజామాబాద్ సిపి నాగరాజు, ఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆర్టీవో వాణి, డీఎస్పీ సోమనాథం, సిఐలు, ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.