అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారుల తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, మే 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద పరిపాలనాపరమైన అనుమతులు మంజూరైన పాఠశాలల్లో ఈ నెలాఖరులోగా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి ఏ ఒక్క పనీ పెండిరగ్‌ ఉండకూడదని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్‌ నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మన ఊరు – మన బడి, ఉపాధి హామీ పథకం, వరి ధాన్యం సేకరణ, ధరణి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఒక్కో మండలం వారీగా ఆయా అంశాలలో సాధించిన ప్రగతి గురించి అడిగి తెలుసుకుంటూ, స్పష్టమైన గడువులు విధించారు. పనులు చేపట్టడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారంలోగా పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించకపోతే సస్పెన్షన్‌ వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్‌ హెచ్చరించారు.

మన ఊరు – మన బడి కార్యక్రమం కింద అనుమతులు తెలిపిన జిల్లాలోని 103 పాఠశాలలకు ఇప్పటికే అడ్వాన్స్‌ రూపంలో నిధులు కూడా విడుదల చేయడం జరిగిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు సకాలంలో పనులు చేపట్టడంలో ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం రోజున అన్ని చోట్ల పనులు ప్రారంభం కావాల్సిందేనని, ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మన ఊరు మన బడి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకొని ఉన్నందున పనులను వేగవంతంగా జరిపించాలని, అదే సమయంలో నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. వరి ధాన్యం సేకరణ అంశంపై చర్చిస్తూ, రైతుల నుండి సేకరించిన ధాన్యానికి సంబంధించి వెంటది వెంట బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. రైతులను అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నందున అధికారులు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.

నిర్దిష్ట గడువు లోపు పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ జరిగేలా కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా ధరణి కార్యక్రమంలో వచ్చిన ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండిరగ్‌ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండిరగ్‌ దరఖాస్తులతో పాటు మే నెలలో వచ్చే అర్జీలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు.

ఉపాధి హామీ పథకం పనితీరును సమీక్షిస్తూ, పనులు జరిపించడంలో వెనుకబడి ఉన్న ఆయా మండలాల అధికారుల తీరుపై కలెక్టర్‌ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. ప్రస్తుతం మే మాసంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు జరగాల్సి ఉన్నప్పటికీ, అనేకచోట్ల అధికారులు అలసత్వాన్ని వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచుతూ, కూలీల ప్రాతినిధ్యం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ప్రగతి సాధించని ఎంపీడీవోలు, ఏపీవోలపై చర్యలు తప్పవని కలెక్టర్‌ స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌, డిఆర్‌డిఓ చందర్‌, డిపిఓ జయసుధ, డిసిఓ సింహాచలం, పంచాయతీ రాజ్‌ ఈఈ శంకర్‌ నాయక్‌, ఆయా మండలాల తాసిల్దార్‌లు, ఎంపీడీవోలు, ఏపీఓలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »