డిచ్‌పల్లి, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో పరిశోధక విద్యార్థులు ముత్తారెడ్డి రాజు, రాగుల సుధాకర్ పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా (మౌఖిక పరీక్ష) శనివారం నిర్వహించారు.
ఆచార్య పి. కనకయ్య పర్యవేక్షణలో పరిశోధకులు ముత్తారెడ్డి రాజు ‘‘మాస్టార్జీ గేయ రచనలు – అనుశీలన’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రూపొందించారు. డా. నాళేశ్వరం శంకరం పర్యవేక్షణలో పరిశోధకులు రాగుల సుధాకర్ ‘‘తెలంగాణ భాషా స్వరూపం’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రూపొందించారు.
పిహెచ్. డి. ఓపెన్ వైవాకు ఎక్సటర్నల్ ఎగ్జామినర్‌గా కడప నుండి యోగివేమన యూనివర్సిటి తెలుగు విభాగం ప్రొఫెసర్ ఆచార్య టి. రామప్రసాద రెడ్డి విచ్చేసి పరిశోధక విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. తెలంగాణ భాషా సాహిత్య అస్తిత్వ ప్రాధాన్య అంశాన్ని తీసుకొని ఇద్దరు పరిశోధకులు పిహెచ్. డి. చేయడం ముదావహం అని ప్రశంసించారు.
వైవా వోస్‌కు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విచ్చేసి పరిశోధనాంశాలను, వివిధ జర్నల్స్‌లో ప్రచురించబడిన వ్యాసాలను, పరిశోధనా ఫలితాంశాలను అడిగి తెలుసుకున్నారు. వైవా వోస్‌కు ఆర్ట్స్ డీన్ ఆచార్య పి. కనకయ్య చైర్మన్‌గా, బిఒఎస్ డా. జి. బాలశ్రీనివాస ముర్తి కన్వీనర్‌గా వ్యవహరించారు. ఇందులో విభాగాధిపతి డా. కె. లావణ్య, అసోసియేట్ ప్రొఫెసర్ డా. వి. త్రివేణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి, ఇతర విభాగాల అధ్యాపకులు డా. నాగరాజు, డా. అబ్దుల్ ఖవి తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముత్తారెడ్డి రాజు, రాగుల సుధాకర్‌లు పిహెచ్. డి. డాక్టరేట్ సాధించడం పట్ల రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, కంట్రోలర్ ఆచార్య ఎం. అరుణ తదితరులు అభినందనలు తెలిపారు.