కామారెడ్డి, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు మన బడి మొదటి విడతకు ఎంపికైన పాఠశాలల ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రతిపాదనలను పూర్తిచేయాలని కోరారు.
ఉపాధి హామీ పథకం కింద వంటశాల, ప్రహరీ గోడ, మరుగుదొడ్ల నిర్మాణం పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. సదాశివనగర్, మాచారెడ్డి, హనుమాజీపేట, నాగిరెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కావాల్సిన సౌకర్యాలను అధికారులు గుర్తించి ప్రతిపాదనలు తయారు చేయాలని పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి సిహెచ్‌సిలో మే 30 లోగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బిచ్కుంద సిహెచ్‌సిలో జూన్ 15 లోగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా విద్యాధికారి రాజు, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.