నిజామాబాద్, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని 5వ డివిజన్ బోర్గాం (పి) పరిధిలో తాగునీరు, విద్యుత్ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్, రూరల్ సబ్ డివిజన్ కార్యదర్శి సాయగౌడ్ మాట్లాడారు.
5వ డివిజన్ పరిధిలో గంగమ్మ గుడి కాలనీలో 30 కుటుంబాల ప్రజలు గత 50 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారన్నారు. వీరికి 2014లో అప్పటి జిల్లా కలెక్టర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ల చేతులమీదుగా 25 కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. వీరికి తాగునీటి సౌకర్యం లేకపోవడంతో కార్పొరేటర్ రాజశేఖర్ బోర్ వేయించగా మాజీ ఎంపిటిసి గుత్ప రఘు బోరు ధ్వంసం చేయించి మూయించాడన్నారు.
అదేవిధంగా విద్యుత్ శాఖ 4 కరెంట్ స్తంభాలను ఏర్పాటుచేస్తే, వాటిని తొలగించాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు. మాజీ ఎంపిటిసి గుత్ప రఘు దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమాయక నిరుపేదలపై దౌర్జన్యానికి పాల్పడుతున్న గుత్ప రఘుపై చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే కాలనీవాసులకు తాగునీరు విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు.
అదేవిధంగా 50 ఏళ్లుగా పైగా ఈ కాలనీ వాసులు పూరి గుడిసెల్లోనే నివసిస్తున్నారన్నారు. వీరికి ఇల్లు నిర్మించుకోవడానికి ఒక కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కాలనీ వాసులకు పోరాడి ఇళ్ల పట్టాలను ఇప్పించామని, సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా వారికి ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు బీ.మురళి, నాయకులు నారాయణ, గంగారం దాసరి బాలరాజు, రమేష్, దినేష్, రామరాజు, గంగామల్లు, లక్ష్మణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.