నిజామాబాద్, మే 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మున్సిపాలిటీలో వాటర్ సప్లై, ఎలక్ట్రికల్, ఆఫీస్ వర్క్, పన్నుల వసూళ్లు తదితర వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 30 శాతం పీఆర్సీని బోధన్ మున్సిపల్ కమిషనర్ ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ సోమవారం తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర నాయకులు బి. మల్లేష్ మాట్లాడుతూ దేవుడు కరుణించిన పూజారి కనికరించనట్లు రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం జూన్ నెల నుండి 30 శాతం పిఆర్సిని పెంచి ఇవ్వాలని చెప్పినప్పటికీ రాష్ట్రంలోని అన్ని రంగాల వారికి ఉద్యోగులకు కార్మికులకు ఇస్తున్నప్పటికీ బోధన్‌లో మాత్రం ఎంఎన్‌ఆర్ కార్మికులకు కమిషనర్ ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో నిజాంబాద్‌తో సహా మిగతా మున్సిపాలిటీలో పెరిగిన పీఆర్సీని అమలు చేస్తున్నప్పటికీ బోధన్ నెంబర్ కార్మికులకు ఇవ్వటానికి కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇది సరైన పద్ధతి కాదని వెంటనే చెల్లించాలని లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్‌ని కలిసి వినతి పత్రం అందజేశారు.
కలెక్టర్ వెంటనే చర్య తీసుకుని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు ఎం. సుధాకర్, జే మక్కయ్య, విజ్ఞానేశ్వర్, డి. నారాయణ, ఎం సాయిలు, ఏం. సాయిలు, గంగారాం, కే. సాయిలు, గోవింద నామ, సత్యనారాయణ, బక్కయ్య, బాలయ్య, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.