డిచ్‌పల్లి, మే 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ కోర్సులకు చెందిన సెమిస్టర్స్ థియరీ పరీక్షలు రేపటి నుంచి అనగా 10వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిధిలో పీజీ పరీక్షలకు గాను గిరిరాజ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్, ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ కళాశాల కామారెడ్డి, ఇందూరు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోధన్, ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాన్సువాడ, సక్సెస్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ ఆర్మూర్, విజేత డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆర్మూర్, యూనివర్సిటి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిచ్‌పల్లి, యూనివర్సిటి కాలేజ్ ఆఫ్ సౌత్ క్యాంపస్ బిక్నూర్ వంటి ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
ఆయా పరీక్షా కేంద్రాలలో సూపరిండెంటెండ్‌లు పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారని ఆమె పేర్కొన్నారు. పరీక్షలకు రూట్ ఆఫీసర్స్‌కు, అబ్జర్వర్స్ కు అధికారిక ఉత్తర్వులు అందాయని అన్నారు. మొదటి సెమిస్టర్స్ విద్యార్థులు మొత్తం 2794, మూడవ సెమిస్టర్స్ విద్యార్థులు మొత్తం 2073, ఆరవ సెమిస్టర్స్ విద్యార్థులు మొత్తం 111 మంది హాజరు కానున్నారని ఆమె అన్నారు. పరీక్షలు ఉదయం 10 నుంచి 1 గంటల వరకు పరీక్షలు నిర్వహింపబడుతాయని, కావున పరీక్షలు రాసే విద్యార్థి అభ్యర్థులు పరీక్షాకేంద్రాలకు అర్థగంట ముందుగానే హాజరు కావాలని ఆమె కోరారు.