పోలీస్‌ ఉద్యోగార్ధుల ముందస్తు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన పురుష అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ శాఖ సహకారంతో ఎడపల్లి మండలం జానకంపేట్‌లోని సీటీసీ కేంద్రంలో ముందస్తు శిక్షణ అందిస్తుండగా, శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు.

కేంద్రంలో అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. వారి కోసం వండిన భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. తాగునీటి సౌకర్యం, వసతి సదుపాయం, డైనింగ్‌ హాల్‌, లైబ్రరీ, బ్యారక్‌ గదులను పరిశీలించారు. ఫ్యాన్‌లు, ట్యూబ్‌ లైట్‌లు పూర్తి స్థాయిలో పని చేసేలా చూడాలని ఆదేశించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో భేటీ అయ్యి, వారి బాగోగుల గురించి ఆరా తీశారు.

ఉద్యోగ సాధనకు ముందస్తు శిక్షణ ఎంతగానో ఉపకరిస్తుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసు కొలువుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదలైనందున అభ్యర్థులు సమయాన్ని ఎంతమాత్రం వృధా చేయకుండా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అకడమిక్‌ పరీక్షలకు, పోటీ పరీక్షలకు ఎంతో తేడా ఉంటుందన్నారు. అకడమిక్‌ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుందని, పోటీ పరీక్షల్లో మాత్రం అత్యధిక మార్కులతో మెరిట్‌ సాధిస్తేనే ఉద్యోగం లభిస్తుందన్నారు.

కేవలం ఒక్క మార్కు తేడాతో ఉద్యోగం అందకుండా పోయే ప్రమాదం ఉన్నందున నూటికి నూరు శాతం సన్నద్ధత అవసరమని సూచించారు. చిన్నచిన్న విషయాలను పక్కన పెట్టి పూర్తిగా విషయం పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకునే దానిపైనే దృష్టిని కేంద్రీకరించాలని, సరైన ప్రణాలికను రూపొందించుకుని తదనుగుణంగా అంకిత భావంతో చదివితే తప్పకుండ విజయం సాధించవచ్చని కలెక్టర్‌ సూచించారు.

తల్లితద్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరు ప్రభుత్వ కొలువు సాధించాలని అన్నారు. కష్టపడాల్సిన తరుణం ఇదేనని, ప్రభుత్వ కొలువును దక్కించుకుంటే జీవితం అంతా సాఫీగా సాగుతుందని పేర్కొన్నారు. అందులోను ప్రభుత్వ యంత్రాంగంలో పోలీసు శాఖకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని, పోలీసు కొలువును ఒడిసిపట్టుకునేందుకు క్రమశిక్షణ, అంకితభావంతో సన్నద్ధం కావడం ముఖ్యమని హితవు పలికారు.

శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు వారు కోరుకున్న మెటీరియల్‌తో పాటు ఇతర సదుపాయాలన్నీ సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎటొచ్చి ప్రస్తుతం ప్రీ కోచింగ్‌ తీసుకుంటున్న వారంతా పోలీస్‌ ఉద్యోగాల నియామక జాబితాలో స్థానం సాధించాలన్నదే తమ ఆకాంక్ష అని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు డీసీపీ ఉషా విశ్వనాధ్‌, సీటీసీ ఏసిపీ శ్రావణ్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »