డిచ్‌పల్లి, మే 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో హిందీ విభాగంలో పరిశోధక విద్యార్థి సయ్యద్ తాహెర్‌కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) ను మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు.
హిందీ విభాగ బిఒఎస్ చైర్మన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. జమీల్ అహ్మద్ పర్యవేక్షణలో ‘‘హిందీ నవలా సాహిత్యంలో అల్ప సంఖ్య వర్గాల చిత్రణ (2000-2010)’’ అనే అంశంపై పిహెచ్. డి. పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించి సమర్పించారు.
వైవా – వోస్‌కు ఎక్స టర్నల్ ఎగ్జామినర్ గా ఇఫ్లూ విశ్వవిద్యాలయంలోని హిందీ విభాగానికి చెందిన ఆచార్యులు ప్రొఫెసర్ శ్యాం రావు రాథోడ్ విచ్చేసి సిద్ధాంత గ్రంథంపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పది సంవత్సరాల పరిమిత కాలంలో హిందీ సాహిత్యంలోని నవలలను గ్రహించి, అందులో మైనారిటీ వర్గాల జీవన వైవిధ్యాన్ని, సామాజిక స్థితిగతులను పరిశోధకుడు విశ్లేషించడం సంతృప్తి దాయకంగా ఉందన్నారు. ముఖ్యంగా ముస్లింల ఆచార వ్యవహారాలు, పేదరికం, అధిక సంతానం, కుటుంబ అజమాయిషి వంటి వాటిపై ప్రత్యేకంగా అధ్యయనం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
వైవా – వోస్‌కు చైర్మన్‌గా ఆర్ట్స్ విభాగ పీఠాధిపతి ప్రొఫెసర్ కనకయ్య, కన్వీనర్‌గా హిందీ బిఒఎస్ డా. ఎం డి జమీల్ మహ్మద్ వ్యవహరించారు. విభాగాధిపతి డా. వి. పార్వతి, పూర్వ విభాగాధిపతి డా. ప్రవీణాబాయి తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సయ్యద్ తాహెర్ డాక్టరేట్ సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్. ఆరతి, కంట్రోలర్ ఆచార్య ఎం. అరుణ, పీఆర్‌ఓ డా. వి. త్రివేణి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు.