కామారెడ్డి, మే 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు రైతుబంధు, బీమా సౌకర్యం కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బీబీ పేట మండలం కోనాపూర్‌లో మంగళవారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, గ్రామపంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
గతంలో పోసానిపల్లిగా ఉన్న గ్రామం ఇప్పుడు కోనాపూర్‌గా మా నానమ్మ ఊరు మారిందని చెప్పారు. తెలంగాణ రావడం వల్ల కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్పారు. ఈ ప్రాంతంలో సాగునీరు పుష్కలంగా లభిస్తుందని తెలిపారు. మారుమూల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు నిర్మించి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు అందజేశామని చెప్పారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. కోనాపూర్ గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
బీబీపేట మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేస్తానని తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఏడేళ్ల కాలంలో రాష్ట్రంలో 17 వేల పరిశ్రమలను రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ నెలకొల్పి తెలంగాణ ప్రాంతంలోని 16 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని అన్నారు. తమ నాన్నమ్మ గ్రామానికి మంత్రి కేటీఆర్ సొంత నిధులు వెచ్చించి పాఠశాల భవన సముదాయాన్ని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మిస్తున్నారని చెప్పారు.
మంత్రిని చూసి తమ నియోజకవర్గాల్లో తాము సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. 80 ఏళ్ల క్రితం కేటీఆర్ నాన్న అమ్మ కుటుంబం అప్పటి నిజాం కాలంలో ప్రాజెక్టు కింద భూములు కోల్పోవడంతో వారికి పరిహారంగా రెండున్నర లక్షల రూపాయలు నిజాం ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. ఆ నిధులతో కేసీఆర్ తండ్రి రాఘవరావు చింతమడక గ్రామంలో 600 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు.
కోనాపూర్ గ్రామానికి మంగళవారం మనుమడు కేటీఆర్ రావడంతో పండగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, సర్పంచ్ నరసమ్మ, జెడ్‌పి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకటేష్ ధోత్రే, చంద్రమోహన్, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.