నిజామాబాద్, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెల జూన్ రెండవ వారం నుండి చేపట్టనున్న హరితహారం కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటేందుకు ఆయా శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో సమాయత్తం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో హరితహారంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ దఫా 45 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం ఉండగా, వివిధ నర్సరీల్లో ఒక కోటి వరకు మొక్కలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారులకు ఇరువైపులా వంద మీటర్ల దూరాన్ని ఎంచుకుని వరుస క్రమంలో మొక్కలు నాటేలా చూడాలన్నారు. అలాగే సారంగాపూర్, చిన్నాపూర్ అర్బన్ పార్కులలో ఖాళీ స్థలాల్లో, చెరువులు, కుంటలు, కాల్వలతో పాటు ప్రధాన జలాశయాలైన నిజాంసాగర్, శ్రీరాంసాగర్ కాల్వల వెంబడి నిర్ణీత మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని వెచ్చిస్తూ హరితహారం చేపడుతున్నందున, నిధులు వృధా కాకుండా నాటిన ప్రతి మొక్క బ్రతికేలా పర్యవేక్షణ జరపాలని హితవు పలికారు. అప్పుడే పచ్చదనం పెంపొందించబడి హరితహారం లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. కాగా, ఇదివరకు నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలని సూచించారు. వచ్చే వారం మళ్ళీ హరితహారం పై సమీక్ష జరుపుతానని, సమగ్ర ప్రణాళికతో హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.